కాశ్మీర్ లో పోలింగ్​కు ముందు రెచ్చిపోయిన ఉగ్రవాదులు

కాశ్మీర్ లో పోలింగ్​కు ముందు రెచ్చిపోయిన ఉగ్రవాదులు
 
* బిజెపికి చెందిన మాజీ సర్పంచ్ హత్య

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఐదో విడత పోలింగ్‌కు ముందు ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అనంత్‌నాగ్‌, షోపియాన్‌లో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరు పర్యటకులు గాయపడ్డారు. మొదటి దాడి అనంత్‌నాగ్‌లోని పర్యటకుల శిబిరంపై జరపగా, అరగంట వ్యవధిలోనే షోపియాన్​లో మాజీ సర్పంచ్, బీజేపీ నాయకుడిపై కాల్పులు జరిపారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం వద్ద శనివారం రాత్రి పర్యటకుల క్యాంప్‌పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాజస్థాన్‌కు చెందిన ఓ జంట గాయపడ్డారు. యన్నర్‌లోని పర్యటకుల రిసార్టు వద్ద ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని తబ్రేజ్‌, ఫర్హాగా గుర్తించారు.  మరో దాడిలో దక్షిణ కశ్మీర్​లోని షోపియాన్​లో శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మాజీ సర్పంచ్‌, బీజేపీ నాయకుడు ఐజాజ్‌ షేక్‌ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రిగా తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో అనంత్‌నాగ్‌, షోపియాన్‌లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనను బీజేపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ పార్టీలు ఖండించాయి. బారాముల్లాలో మే 20న పోలింగ్ జరగనుంది.  అనంత్​నాగ్​లోని రాజౌరీ లోక్​సభ స్థానానికి మాత్రం మే 7న పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేయడం వల్ల మే 25వ తేదీకి వాయిదా పడింది.

మరోవంక, ఎన్నికల వేళ ఛత్తీస్​గఢ్​లో వరుస ఎన్​కౌంటర్లు జరిగాయి. ఇటీవల బీజాపుర్​ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో 12 మంది మావోయిస్టులు మరణించారు. గంగలూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలోనే కూంబింగ్ చేపడుతున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడటం వల్ల కాల్పులు జరిగాయి.