కుమారస్వామి పేరు చెప్తే రూ 100 కోట్లు ఇస్తానన్న శివకుమార్

* నేరం రుజువైతే రేవణ్ణపై చర్యలు తీసుకోండి… దేవెగౌడ

ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ వీడియోలు లీకైన కేసుల అడ్వ‌కేట్ జీ దేవ‌రాజే గౌడ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఉపముఖ్యమంత్రి  డీకే శివ‌కుమార్‌తో పాటు న‌లుగురు మంత్రుల పాత్ర‌ ఈ కేసులో ఉన్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. హ‌స‌న్ జిల్లా ప్రిజ‌న్స్‌కు తీసుకెళ్తున్న స‌మ‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 

 
ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ కేసులో హెచ్‌డీ కుమార‌స్వామి పేరును ఇరికించేందుకు డీకే శివ‌కుమార్ ప్ర‌య‌త్నించిన‌ట్లు పేర్కొన్నారు. కుమార‌స్వామిపై ఆరోప‌ణ‌లు చేస్తే త‌న‌కు రూ. 100 కోట్లు ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం సిద్ద‌మైన‌ట్లు దేవ‌రాజే గౌడ ఆరోపించారు.   ప్ర‌జ్వ‌ల్ వీడియోలు లీకేజీ వెనుక కుమార‌స్వామి ఉన్న‌ట్లు చెప్పేందుకు త‌న‌కు డీకే వంద కోట్లు ఆఫ‌ర్ చేశాడ‌ని చెప్పారు. 
 
 మంత్రులు చాలువ‌ర‌య‌స్వామి, కృష్ణ బైర గౌడ‌, ప్రియాంక్ ఖ‌ర్గేతో పాటు మ‌రికొంత మంది ఆ ఆఫ‌ర్ చేసిన‌ట్లు దేవ‌రాజే గౌడ తెలిపారు. త‌న‌కు అడ్వాన్స్‌గా  తాను బౌరింగ్ క్లబ్‌లోని 110 నంబరు గదిలో ఉన్నప్పుడు అడ్వాన్స్‌గా చెన్నరాయపట్నానికి చెందిన గోపాలస్వామి అనే వ్యక్తితో రూ.5 కోట్ల పంపారని ఆరోపణలు చేశారు. కానీ దానికి తాను అంగీక‌రించ‌లేద‌ని, అందుకే కుట్ర ప‌న్ని త‌న‌ను ఇరికించిన‌ట్లు గౌడ ఆరోపించారు.ప్రజ్వల్ రేవణ్ణ మాజీ డ్రైవర్ కార్తీక్ నుంచి డీకే శివకుమార్ పెన్ డ్రైవ్ పొందారని దేవరాజే గౌడ చెప్పారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వివాదం అయ్యేందుకు ముమ్మాటికీ డీకేనే కారణం అని దుయ్యబట్టారు. మోదీకి, బీజేపీకి న‌ష్టం చేయాల‌న్న ఉద్దేశంతో డీకే శివ‌కుమార్ ఈ ప్లాన్ వేసిన‌ట్లు గౌడ ఆరోపించారు. త‌న‌పై లైంగిక వేధింపులు, రేప్ కేసు న‌మోదు చేశార‌ని, కానీ ఏ ఆధారాలు చిక్క‌లేద‌ని, ఇప్పుడు పెన్ డ్రైవ్ కేసులో త‌న‌ను ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని గౌడ తెలిపారు.

‘డీకే శివకుమార్ డీల్‌కు నేను అంగీకరించలేదు… అందుకు నాపై కక్షసాధింపు చర్యలకు దిగారు.. అట్రాసిటీ కేసు పెట్టారు.. ఆధారాలు లేకపోవడంతో మరో కేసు బనాయించారు.. లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి జైలుకు పంపారు.. రూ.100 కోట్ల ఆఫర్‌కు సంబంధించి ఆడియో రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ ఆడియో రికార్డింగ్స్ బయటపెడితే కాంగ్రెస్ సర్కారు కూలిపోతుంది.. ప్రజ్వల్ రేవణ్ణ కేసుకు సంబంధించి సిట్ మీద నాకు నమ్మకం లేదు. సాక్ష్యాధారాలను సీబీఐకి మాత్రం అందజేస్తాను… తన వద్ద ఉన్న వీడియోలు విడుదలైన వాటికి తేడా ఉంది’ దేవరాజే గౌడ వివరించారు.

ఇలా ఉండగా, కర్ణాటకలో జేడీఎస్ ఎంపీ, మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు 92వ పుట్టినరోజు జరుపుకుంటున్న దేవెగౌడ తన మనవడు ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలిసారి స్పందించారు. 
 
నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే, లైంగిక వేధింపులు, మహిళ కిడ్నాప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడు జేడీఎస్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై మాత్రం తప్పుడు కేసులు పెట్టారని మాజీ ప్రధాని ఆరోపించారు. ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇందులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టకూడదని వ్యాఖ్యానించారు. “ప్రజ్వల్ ప్రస్తుతం దేశంలో లేడు. చట్టప్రకారం చర్యలు ఉండాలని ఇప్పటికే హెచ్‌డీ కుమారస్వామి చెప్పాడు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పేర్లు చెప్పను కానీ వారిపై కూడా చర్యలు ఉండాలి” అని దేవెగౌడ స్పష్టం చేశారు.