కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా మూక హింస

కిర్గిస్థాన్ రాజధాని బిష్కేశ్‌లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు కొత్త సమస్యలో కూరుకుపోయారు. ఇక్కడి స్థానిక ప్రజలు విదేశీ విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. అటువంటి హింసాత్మక గుంపు నగరం అంతటా అల్లర్లు సృష్టించింది. విదేశీ విద్యార్థులపై దాడి చేసింది. ఈ దాడిలో పాకిస్థానీ విద్యార్థులు అత్యధికంగా బాధితులు, గుంపు దాడి కారణంగా దాదాపు నలుగురు పాకిస్థానీ విద్యార్థులు మరణించారు. 
 
భారతదేశం, పాకిస్తాన్, ఇతర దేశాల నుండి వేలాది మంది విద్యార్థులు మెడిసిన్ చదవడానికి కిర్గిజ్‌స్థాన్‌కు వెళతారు. కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కేష్‌లో ఎక్కువ మంది విద్యార్థులు నివసిస్తున్నారు. అయితే ఇటీవల పరిస్థితులు దారుణంగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఈజిప్టు విద్యార్థులు అక్కడ దోపిడీ చేస్తున్న స్థానిక దొంగలతో క‌ల‌సి దాడులకు పాల్ప‌డుతున్నారు. 
 
ముఖ్యంగా పాక్, ఇండియా, అప్ఘ‌నిస్తాన్ విద్యార్ధులే టార్గెట్‌గా దాడులు కొన‌సాగుతున్నాయి. కిర్గిస్థాన్‌, ఈజిప్ట్‌కు చెందిన విద్యార్థుల మధ్య మే 13వ తేదీన జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు శుక్రవారం వైరల్‌ కావడం దాడులకు దారి తీసింది.  అక్కడ భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ విద్యార్థులు నివసించే బిష్కెక్‌లోని కొన్ని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్లపై దాడి జరిగింది.  ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. మరికొంతమంది గాయాలపాలైనట్లు తెలిపింది
 
కాగా, కిర్గిస్థాన్ రాజ‌ధాని బిషెక్‌లో విదేశీ విద్యార్థుల‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అక్క‌డ ఉంటున్న విద్యార్ధుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ప్ర‌స్తుతం అక్క‌డి ఆందోళ‌న‌కర‌ ప‌రిస్థితి దృష్ట్యా భార‌త విద్యార్థులు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని తెలిపింది. ఈ మేర‌కు అక్క‌డి భార‌త ఎంబ‌సీ ఎక్స్ (ట్విట‌ర్‌) వేదిక‌గా కీల‌క సూచ‌న చేసింది.  ఇక ఘ‌ర్ష‌ణ‌లు తీవ్ర‌మైతే అక్క‌డి నుంచి భార‌తీయ విద్యార్ధుల‌ను ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కి కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 
‘మన విద్యార్థుల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికి, విద్యార్థులు ఎవరూ బయటకు రావొద్దు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలి’ అని పేర్కొంది. ఈ మేరకు 24 గంటలపాటూ అందుబాటులో ఉండే ఫోన్ నంబర్‌ (0555710041)ను షేర్ చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం కిర్గిస్థాన్‌లో దాదాపు 14,500 మంది భారతీయ విద్యార్థులు నివసిస్తున్నారు.
 
మరోవైపు దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అక్కడి పాక్‌ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావొద్దంటూ సూచించింది. బిష్కెక్‌లోని కొన్ని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్లు, పాకిస్థానీలతో సహా విదేశీ విద్యార్థుల ప్రైవేట్‌ నివాసాలపై దాడులు జరిగినట్లు తెలిపింది.  అయితే, ఈ దాడిలో పాక్‌కు చెందిన విద్యార్థుల మరణాలు, గాయాలపై నివేదికలు వచ్చినప్పటికీ తమకు ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది.  ప్రస్తుతం మధ్య ఆసియా దేశంలో దాదాపు 10,000 మంది పాకిస్థానీ విద్యార్థులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.