ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు చెందేలా చేస్తాం

ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు చెందేలా చేస్తాం
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఘాటుగా స్పందించారు. 2014 వరకూ కాంగ్రెస్‌ హయాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిరుపయోగంగా ఉందని, తమ ప్రభుత్వం వచ్చాకే ఈడీ సమర్థవంతంగా పనిచేయడం ప్రారంభించిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 
 
నేడు ప్రతిపక్షాలు విమర్శిస్తున్న చట్టాలు, సంస్థలు కాంగ్రెస్‌ హయాంలోనూ ఉన్నాయని మోదీ గుర్తు చేశారు.  అదే సమయంలో ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్ముపై కూడా ప్రధాని స్పందించారు. ఆ సొమ్మును పేదలకు పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ‘అవినీతి కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్వాధీనం చేసుకున్న డబ్బును పేదలకు తిరిగి పంచే అవకాశాలను కేంద్రం అన్వేషిస్తోంది’ అని మోదీ వెల్లడించారు. 
 
గత ప్రభుత్వాల హయాంలో కొందరు వ్యక్తులు అధికార బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బంతా తిరిగి వారికే చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం లీగల్‌ టీమ్‌ సహాయాన్ని తీసుకుంటున్నట్లు చెప్పారు. 
 
ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బును ఏం చేయాలో సలహా ఇవ్వాలని న్యాయవ్యవస్థను కోరినట్లు ప్రధాని వివరించారు. ఇందుకోసం చట్టపరమైన మార్పులు చేయాల్సి వస్తే దానికీ వెనుకాడబోమని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.2,200 కోట్లను జప్తు చేసినట్లు ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. కాగా, కేంద్రంలో త‌మ స‌ర్కారు హ్యాట్రిక్ కొట్ట‌నున్న‌ట్లు  యూపీలోని బారాబంకిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో  మాట్లాడుతూ ప్రధాని చెప్పారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌ర‌ళి ముగుస్తున్నా కొద్దీ.. ఇండియా కూట‌మి పేక‌మేడ‌లా కూలుతోంద‌ని విమ‌ర్శించారు. తాము ఏర్పాటు చేయ‌బోయే కొత్త ప్ర‌భుత్వంలో పేద‌, యువ‌త‌, మ‌హిళ‌లు, రైతుల కోసం పెద్ద నిర్ణ‌యాల‌ను తీసుకోనున్న‌ట్లు చెప్పారు. బీజేపీ-ఎన్డీఏ కూట‌మి జాతీయ ప్ర‌యోజ‌నాల కోసం క‌ట్టుబ‌డి ఉంద‌ని, ఇండియా కూట‌మి మాత్రం దేశంలో అస్థిర‌త సృష్టిస్తోంద‌ని ప్ర‌ధాని తెలిపారు.

ఒక‌వేళ స‌మాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే, అప్పుడు రామ్‌ల‌ల్లా మ‌ళ్లీ టెంట్‌లోకి వెళ్తార‌ని ప్ర‌ధాని మోదీ హెచ్చరించారు. రామాల‌యంపై వాళ్లు బుల్డోజ‌ర్ తోలిస్తార‌ని విమ‌ర్శించారు. యోగీజీ నుంచి వాళ్లు ట్యూష‌న్ తీసుకోవాల‌ని, ఎక్క‌డ బుల్డోజ‌ర్ న‌డ‌పాలి, ఎక్క‌డ తీయ‌వ‌ద్దు అన్న విష‌యాన్ని విప‌క్షాలు తెలుసుకోవాల‌ని మోదీ హితవు చెప్పారు.