కల్నల్‌ వైభవ్‌ కాలే మృతికి క్షమాపణలు చెప్పిన ఐరాస

కల్నల్‌ వైభవ్‌ కాలే మృతికి క్షమాపణలు చెప్పిన ఐరాస
గాజాలో భారత్‌కు చెందిన మాజీ ఆర్మీ అధికారి మృతిపై ఐక్యరాజ్య సమితి విచారం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా భారత్‌కు క్షమాపణలు చెప్పింది. కల్నల్‌ వైభవ్‌ అనిల్‌ కాలే (46) గాజాలోని రఫాలో ఓ వాహనంలో ప్రయాణిస్తుండగా దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన 2022 వరకు సైన్యంలో పని చేసిన ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ కోరారు. 
 
ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రత విభాగంలో సమన్వయ అధికారిగా పని చేస్తున్నారు.  ఆయన సైన్యంలో ఉన్న సమయంలో 11వ జమ్మూ కశ్మీర్‌ రైఫిల్స్‌కు నాయకత్వం వహించారు. ఈ ఘటనలో యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో అనిల్‌ కాలేతో కలిసి పనిచేస్తున్న జోర్డాన్ మహిళ సైతం ప్రాణాలు కోల్పోయింది. 
 
ఐక్యరాజ్యసమితి సిబ్బంది ఐక్యరాజ్యసమితికి చెందిన చిహ్నాలతో కూడిన వాహనంలో రఫాలోని యూరోపియన్‌ యూనియన్‌ ఆసుపత్రికి వెళ్తుండగా వాహనంపై వెనుక వైపు నుంచి దాడి జరిగింది. ఇజ్రాయెల్‌ ఆర్మీ యుద్ధ ట్యాంక్‌తో దాడి జరిపిందని భావిస్తున్నారు. 
 
వైభవ్ అనిల్ కాలే మృతిపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సంతాపం వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన దాడి అయి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది. 
 
ప్రస్తుతం గాజాలో 71 మంది యూఎస్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. గాజాలో ఇప్పటివరకు 190 మందికి పైగా ఐక్యరాజ్యసమితి ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, తొలిసారిగా అంతర్జాతీయ ఉద్యోగి మరణించడం ఇదే తొలిసారి.