తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో పిడుగు పడి తాత-మనవడు మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పిడుగుపాటుతో గాయపడిన ఐదుగురికి వైద్య సాయం అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఆదిలాబాద్ జిల్లాలో గాలి దుమారం, ఈదురుగాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిది. జైనథ్ మండలం గిమ్మ గ్రామ శివారులో పిడుగుపాటుకు అయిదుగురు వ్యక్తులు గాయాలపాలవ్వటం కలకలం సృష్టించింది. వీరిలో గిమ్మ గ్రామానికే చెందిన మామిడిపల్లి కిరణ్ అనే వ్యక్తి మృతి చెందటం స్థానికంగా విషాదం నింపింది.
ఎంపీటీసీ సభ్యుడు కోల భోజన్న, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్, ఉప సర్పంచ్ భర్త రమేష్‌లకు గాయాలవ్వగా, సంటెన్న అనే మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బాధితులను పరామర్శించారు. ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు.
ఒకవంక, సోమవారం లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాతో పాటు పలు జిల్లాల పరిధిలో గాలి వాన, పిడుగులు పడి సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున జిల్లాల్లో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతే, రైతులు ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లోని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

More Stories
ప్రజలపై కాంగ్రెస్ అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!