పోలింగ్ సందర్భంగా పలుచోట్ల హింస చెలరేగడంతో ఏపీలో ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. తెనాలి, తాడిపత్రి వైసిపి ఎమ్యెల్యేలు, ప్రస్తుత అభ్యర్థులు అన్నాబత్తుని శివకుమార్, కేతిరెడ్డి పెద్దారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెనాలిలో ఒక ఓటరు చెంప చెళ్లుమనిపించిన వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌పై వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈసీ పోలీసులను ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఆయనను హౌస్ అరెస్టులో ఉంచాలని పేర్కొంది. పోలింగ్ కేంద్రంలో ఓటర్ పై చేయి చేసుకున్న ఘటనపై ఈసీ ఈ చర్యలు తీసుకుంది.
పోలింగ్ కేంద్రంలోకి తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఎమ్మెల్యే శివకుమార్‌ను ఓటర్లు అడ్డుకున్నారు. ఓ యువకుడు ఎమ్మెల్యే తీరును ప్రశ్నించడంతో ఆగ్రహించిన శివకుమార్ ఓటరును చెంప దెబ్బ కొట్టారు. దీంతో సదరు వ్యక్తి కూడా ఎదురు తిరిగి ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు.
ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మరోవైపు ఎమ్మెల్యే ఓటరుపై దాడి చేసిన ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయంలోని కంట్రోల్ రూమ్‌లో ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న ఎన్నికల పోలీస్ పరిశీలకుడు మిశ్రా గుర్తించారు. ఎమ్మెల్యే అభ్యర్థి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఈఓ ముకేష్ కుమార్ మీనా స్పందిస్తూ సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు. పోలింగ్ కేంద్రం నుంచి లైవ్ వెబ్‌కాస్టింగ్ ఫుటేజీ తమ వద్ద ఉందని చెబుతూ దాడికి పాల్పడిన ఎమ్మెల్యేతో పాటు ఇతరులపై కేసు నమోదు చేయాలని గుంటూరు ఎస్పీను ఆదేశించినట్లు తెలిపారు.
మరోవంక, తాడిపత్రి రణరంగంగా మారింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు, యువర్ వర్గాలకు చెందిన ఇరువురికి గాయాలయ్యాయి. ఓం శాంతి నగర్ కాలనీలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూతు వద్ద ఘర్షణ చోటుచేసుకుందని తెలుపడంతో ఎమ్మెల్యే తనయుడు హర్షవర్ధన్ రెడ్డి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు.
అనంతరం టిడిపి అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి , జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒకరి తర్వాత ఒకరు పోలింగ్ బూత్ వద్దకు వెళ్లే తరుణంలో టిడిపి అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఇరువురు ఒకరికొకరు ఎదురుపడటంతో ఇరు వర్గాలు కేకలు వేసుకుంటూ ఒకరిపై ఒకరు రాళ్ల దాడులకు పాల్పడ్డారు.
ఈ దాడిలో టిడిపి అభ్యర్థి జేసీ అస్మిత రెడ్డి వాహనం అద్దాలు ధ్వంసం కాగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనంతో పాటు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, కందిగోపుల మురళి తోపాటు వైసీపీ వర్గీయులకు చెందిన మరో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ అమిత్ బర్దర్ సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న హింసపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడడంలో పోలీసు అధికారులు విఫలం అయ్యారని చంద్రబాబు విమర్శించారు.

More Stories
ముంబై మారణహోమానికి 17 ఏళ్ళు.. నాటి స్పందన సిగ్గుచేటు!
శతాబ్దాలుగా మార్గం ఏర్పర్చిన గురు తేజ్ బహదూర్ బలిదానం
ఎస్ఐఆర్ పై బిజెపి దేశవ్యాప్త అవగాహన కార్యక్రమం