
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా రాయలసీమలో ప్రత్యేక బలగాలను మోహరింప చేయాలనీ ఎన్నికల కమిషన్ ను బిజెపి, ఇతర కూటమి నేతలు ఆదివారం సాయంత్రం కోరారు. పోలింగ్ నిర్వాహణకు భద్రత పెంచాలంటూ కూటమి నేతలు ఏపీ ఈసీ, సీఐఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లల్లో లోపాలపై చర్యలు చేపట్టాలని వినతి పత్రం ఇచ్చారు.
ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎన్నికల నిర్వాహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెబుతూ ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్ నియోజకవర్గాలు సమస్యాత్మకంగా ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని క్రిటికల్ సెన్సిటివ్ నియోజకవర్గాలుగా ఇప్పటికే గుర్తించారని గుర్తు చేశారు. ధర్మవరం కూటమి అభ్యర్థి, బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మరిన్ని కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ తెలిపారు. కోర్టు తీర్పు సారాంశాన్ని ఎన్నికల ప్రధానాధికారికి నివేదించామని ఆమె చెప్పారు.
రాయలసీమలో ఇబ్బంది ఉందనే ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు భద్రత పెంచాలని కోరినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. భద్రత పెంచే విషయంపై డీజీపీకి కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చామని పేర్కొన్నారు. రాయలసీమలో ఎన్నికలను ప్రభావితం చేయడానికి బెదిరింపులకు దిగుతున్నారని వారు ఈసీ దృష్టికి తీసుకొచ్చారు.
రాయలసీమ జిల్లాల్లో అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రత కోసం కోర్టుకు వెళ్లామని బీజేపీ నేత కిలారు దిలీప్ వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెడుతున్నామని ఈసీ వెల్లడించారని తెలిపారు. భద్రత కల్పించే విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సీఈఓకి అందించామని, ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్ నియోజక వర్గాల్లో కేంద్ర బలగాలు మోహరించాలని కోరామని వివరించారు.
‘రాయలసీమ జిల్లాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయుధ బలగాలను పెంచాలని సీఈవో ముకేశ్ కుమార్ మీనాను కోరాం. ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్ నియోజకవర్గాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. వీటిని క్రిటికల్ సెన్సిటివ్ నియోజకవర్గాలుగా ఇప్పటికే గుర్తించారు. రాయలసీమలో ఎన్నికలను ప్రభావితం చేయడానికి అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు దిగుతున్నారు’ అని యామిని శర్మ తెలిపారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు