కాశ్మీరీ పండిట్లలో `గర్ వాపసీ’ ఆశలు

శ్రీనగర్ లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో మే 13న ఎన్నికలు జరగనుండగా, కాశ్మీరీ పండిట్ లలో ‘గర్ వాపసి’ (తమ స్వస్థలాలకు  తిరిగి వెళ్లడం) కోసం కొత్త ఆశలు  చిగురిస్తున్నాయి. 8.7 లక్షల మంది మహిళలు సహా 17.4 లక్షల మంది ఓటర్లు 24 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. జమ్మూలోని కాశ్మిరీ పండిట్ల వలస ఓటర్ల కోసం స్థానిక అధికారులు రెండు సహాయక కేంద్రాలతో సహా 21 పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు.
 
1,500 కంటే ఎక్కువ మంది ఓటర్ల కోసం రెండు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం తప్పనిసరి అని భారత ఎన్నికల సంఘం రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించి ఈ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.  నియోజకవర్గం అంతటా, కశ్మీరీ వలసదారుల కోసం ప్రత్యేకంగా 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
 
ప్రజాస్వామ్య ప్రక్రియలో వారి భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో ఈ స్టేషన్లు జమ్మూ, ఢిల్లీ, ఉధంపూర్‌లలో విస్తరించి ఉన్నాయి. మొత్తం మీద, 1.13 లక్షల మంది నమోదిత వలస ఓటర్ల స్వరాలు ఎన్నికల ఫలితాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దశాబ్దాలుగా, కాశ్మీరీ పండిట్‌లు ‘ఇల్లు’ అని పిలిచే ప్రదేశానికి తిరిగి వెళ్లాలని తహతహలాడుతున్నారు. ఎట్టకేలకు తమ ఆశలు నెరవేరుతాయని, కశ్మీర్‌కు తిరిగి రావాలనే తమ కలలు సాకారం అవుతాయని ఈ ఎన్నికలు వారికి ఆశాజనకంగా ఉన్నాయి.
 
1990వ దశకం మొదట్లో వలస వచ్చిన కాశ్మీరీ పండిట్లకు తిరిగి స్వస్థలాలకు వెళ్లే విధంగా చూస్తామని 2019 ఎన్నికల ప్రణాళికలో బిజెపి హామీ ఇచ్చిన్నప్పటికీ ఆ దిశలో చెప్పుకోదగిన ప్రయత్నాలు ఇప్పటివరకు జరగడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర భుత్వం  ముందడుగు వేయలేకపోతున్నది. అందుకనే తాము కాశ్మీర్ కు తిరిగి వెళ్లేందుకు ఇప్పుడు పార్లమెంట్ పై ఆధార పడుతున్నామని  చెబుతున్నారు.