అల్లు అర్జున్ పర్యటనతో నంద్యాల ఎస్పీపై వేటు

అల్లు అర్జున్ పర్యటనతో నంద్యాల ఎస్పీపై వేటు
మరికొన్ని గంటల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానున్న వేళ ఆదివారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది పోలీసు అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్‌ ఫైల్‌ చేయాలని ఈసీ ఆదేశించింది. 

ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్‌రెడ్డి, సీఐ రాజారెడ్డిలపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు అధికారులపై తీసుకున్న చర్యల వివరాలను ఆదివారం రాత్రి 7 గంటల్లోపు తెలియజేయాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.  సినీనటుడు అల్లు అర్జున్‌ నంద్యాల పర్యటనకు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఈసీ తెలిపింది. ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు గుమికూడారని, 144 సెక్షన్‌ అమలులో ఉన్నా జనాలను నియంత్రించటంతో పోలీసులు విఫలమయ్యారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 నంద్యాలలో సినీ నటుడు అల్లు అర్జున్‌ పర్యటన వివాదాస్పదంగా మారింది. ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ అయిన శనివారం  తనకు స్నేహితుడైన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే, అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి బాలీవుడ్ నటుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ తన భార్య స్నేహరెడ్డితో కలిసి ఉదయం అల్పాహారాన్ని వెళ్లారు. ఆయన పర్యటనకు రిటర్నింగ్‌ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు.

 
వైసీపీ శ్రేణులు వ్యూహాత్మకంగా పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయనను తీసుకువచ్చాయి. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులూ లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు.
 
మరోవైపు, తమ అనుమతి లేకుండా జన సమీకరణ చేశారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ ఆఫీసర్ అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేయగా క్రైమ్ నెంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేశారు.
ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండగా ఇంచుమించు అదే సమయంలో హీరో అర్జున్‌ పర్యటన ఉండటంతో జిల్లా కేంద్రంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం స్పందించింది.

తిరుప‌తికి చెందిన ఐదుగురు సీఐలు బదిలీ

అదేవిధంగా తిరుప‌తికి చెందిన ఐదుగురు సీఐలపై ఈసీ బదిలీ వేటు వేసింది. వైఎస్సార్సీపీకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న తెలుగుదేశం నేతల ఫిర్యాదుతో ఈసీ చర్యలు తీసుకుంది. ఐదుగురిని అనంతపురం బదిలీ చేసింది. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, అంజూయాద‌వ్, అమ‌ర‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌ను అనంతపురంలో విధులు నిర్వహించాలని ఆదేశించింది.