28200 మొబైళ్లు బ్లాక్.. 20 లక్షల నంబర్లు కట్!

28200 మొబైళ్లు బ్లాక్.. 20 లక్షల నంబర్లు కట్!
* సైబర్​ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం

సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల్లో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) కీలక నిర్ణయం తీసుకుంది. 28,200 మొబైల్​ హ్యాండ్​సెట్​లను బ్లాక్​ చేయాలని, అంతేకాకుండా వాటికి అనుసంధానమైన 20 లక్షల మొబైల్​ కనెక్షన్​లను రీవెరిఫికేషన్​ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

డీవోటీ, కేంద్ర హోం శాఖ, రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా ఈ పనిని చేయనున్నట్లు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మోసగాళ్ల నెట్​వర్క్​లను విచ్ఛిన్నం చేయడం, డిజిటల్​ ప్రమాదాల నుంచి పౌరులను రక్షించడమే తమ సంయుక్త లక్ష్యం అని ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, కేంద్ర హోం శాఖ, ఆయా రాష్ట్ర పోలీసులు కలిసి జరిపిన విశ్లేషణలో సైబర్​ క్రైమ్​లలో 28,200 మొబైల్​ హ్యాండ్​సెట్​లను దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. ఈ నివేదికను డీవోటీ మరింత విశ్లేషించి, దుర్వినియోగమైన మొబైల్​ హ్యాండ్​​సెట్​లలో 20 లక్షల నంబర్లను ఉపయోగించినట్లు కనుగొంది. 

అనంతరం ఈ మొబైల్​ హ్యాండ్​సెట్​లను దేశవ్యాప్తంగా బ్లాక్​ చేయాలని, వాటికి అనుసంధామైన 20 లక్షల మొబైల్​ కనెక్షన్​లను వెంటనే రీవెరిఫికేషన్ చేయాలని టెలికాం సర్వీస్​ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను నిరుత్సాహపరుస్తాయని భావిస్తున్నారు. 

కాగా, సైబర్ మోసానికి సంబంధించిన నేరాల్లో పౌరులు ఫిర్యాదులు చేసే ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. దీని ద్వారా గణనీయమైన డేటా బ్యాంక్ ఏర్పడింది. ఈ డేటా బ్యాంక్ ప్రధాన సైబర్ నేరగాళ్లను పట్టుకోవడంలో కీలకంగా మారుతోంది. ప్రభుత్వం 2019లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలు సైబర్ మోసాలను సులవుగా నివేదించవచ్చు.