జిహాద్ కు, అభివృద్ధికి మ‌ధ్య ఎన్నిక‌లు

జిహాద్ కు, అభివృద్ధికి మ‌ధ్య ఎన్నిక‌లు
జిహాద్ కు, అభివృద్ధికి మ‌ధ్య జ‌రుగనున్న ఎన్నిక‌లు ఇవ‌ని, ప్ర‌జ‌లు ఆలోచించి ఓటు వేయాల‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపిచ్చారు. ఈ ఎన్నికలు రాహుల్, మోదీకి మధ్య, కుటుంబ పాలనకు, భారతీయ కుటుంబానికి మధ్య పోటీ జరుగుతుంద‌ని చెప్పారు. భువనగిరి లోక్‌సభ బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయ‌న మాట్లాడుతూ రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీ వర్సెస్ మోదీ  గ్యారంటీ మధ్య జరుగుతున్న ఎన్నికలు అని చెప్పారు.

ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్పుడు దేశ వ్యాప్తంగా మోదీ నామస్మరణ వినిపిస్తోందని, ఇప్పటికే బీజేపీ 200స్థానాలకు మించి గెలిచిపోయిందని అమిత్ షా పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన మాట వినాలని అంటూ ఈ సారి తాము పది కంటే ఎక్కువ సీట్లు తెలంగాణాలో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోర్ తో దేశంలో 400 సీట్లకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైందని పేర్కొంటూ ఆ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. అబద్ధాలతో ఎన్నికలు గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. మోదీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని అవాస్తవాలు చెబుతున్నారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని మరోసారి స్పష్టత ఇచ్చారు.

తెలంగాణాలో రాహుల్ గాంధీ గ్యారంటీలు చెల్లే పరిస్థితి లేదని చెబుతూ రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలు కాలేదని గుర్తు చేశారు. రైతులకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అమలు చేయలేదని, రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం నెరవేర్చలేదని పేర్కొన్నారు. బీజేపీకి 400 సీట్లు రావాలా? వద్దా? మోదీని మూడోసారి ప్రధానిని చేయాలా? వద్దా? అని ప్రశ్నించారు.

భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీకి సన్నిహితుడ‌ని, రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారంటూ అమిత్ షా ఆరోపించారు. మోదీ 10ఏళ్లుగా పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నా రిజర్వేషన్లు తొలగించలేద‌నే విష‌యాన్ని గుర్తు చేశారు.

ప్ర‌ధాని మోదీ చెప్పిందే చేస్తార‌ని, చేసేది చెబుతార‌ని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఏఐసీసీ అధ్య‌క్షుడు ఖర్గేకి తెలియనిది ఏందంటే భువనగిరి నుంచి కాశ్మీర్ కోసం ప్రాణాలు ఇచ్చే యువత ఉన్నార‌ని అంటూ మోదీ 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ మనది అని తేలిపోయింద‌ని తెలిపారు. ఇక దేశంలో నక్సలిజం రూపుమాపి దేశాన్ని సురక్షితం చేసిన ఏకైక ప్ర‌ధాని మోదీనేనంటూ ప్ర‌శంసించారు.

ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్క‌టే అని, వాటిని న‌మ్మ‌వ‌ద్ద‌ని ఓట‌ర్ల‌ను అమిత్ షా కోరారు. హైదరాబాద్ విమోచన దినం జరపకుండా అడ్డుకున్నార‌ని, సీఏఏకి వ్యతిరేకంగా మాట్లాడ‌రంటూ ధ్వ‌జ‌మెత్తారు. రామమందిరం ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీలు అవి అంటూ అమిత్ షా మండిప‌డ్డారు..

భువనగిరి టెక్స్ టైల్స్ పరిశ్రమ ఏర్పాటుకు మోదీ కృషి చేశార‌ని అంటూ ఉపాధి కల్పనలో కేంద్రం అనేక పనులు చేసింద‌ని పేర్కొన్నారు. భువ‌న‌గిరిలో ఎయిమ్స్ ఏర్పాటుతో పేదల పక్షాన మోదీ నిలిచార‌ని చెప్పారు. సూర్యాపేట నుండి సిద్ధిపేట వరకు జాతీయ రహదారి ఏర్పాటు పూర్తిగా అయింద‌ని అమిత్ షా చెప్పారు. 

బీఆర్ఎస్ పాల‌నలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణలో దోపిడీ జరిగింద‌ని అమిత్ షా ఆరోపించారు. తెలంగాణలో 10 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీకి అవకాశం ఇస్తే దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ ఉండేలా పని చేస్తామ‌ని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్న బూర నర్సయ్య గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.