వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు కాంగ్రెస్ నేతల అరెస్ట్

వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు కాంగ్రెస్ నేతల అరెస్ట్

బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.  గురువారం వారిని అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. అరెస్టయిన వారిలో కాంగ్రెస్ ఐటీ సెల్ నేతలు గీత, శివ, తస్లీమ, మన్నె సతీష్, అస్మా ఉన్నారు. బీజేపీ నేత ప్రేమేందర్  రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఢిల్లీ పోలీసుల నోటీసుల కంటే ముందే హైదరాబాదులో కేసు నమోదైంది. గురువారం ముగ్గురిని అరెస్ట్ చేసి హైదరాబాద్ సీపీఎస్‌కు తరలించారు.  కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి మరో నలుగురికి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు మరోసారి గురువారం గాంధీభవన్‌కు వచ్చారు. 

పీసీసీ లీగల్‌ సెల్‌ నాయకులతో మాట్లాడి నోటీసులు ఇస్తామన్న ఢిల్లీ పోలీసులు లీగల్ సెల్‌ నాయకులు లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.
అమిత్ షా మాటలను వక్రీకరించి, ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారనే అభియోగంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు గత నెల 29న ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 
 
 రాష్ట్ర కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగం ఛైర్మన్‌ మన్నె సతీశ్‌, కో-ఆర్డినేటర్‌ నవీన్‌, పీసీసీ కార్యదర్శి శివ కుమార్‌, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీంలకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను నేరుగా గాంధీభవన్ కు పంపించారు. తాజాగా మరో నలుగురికి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు నేడు మరోసారి గాంధీభవన్‌కు వచ్చారు.