మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు కొనసాగుతాయని, ఇప్పట్లో వడగాల్పులు తగ్గుముఖం పట్టవని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తూర్పు భారతదేశంలో అసాధారణంగా తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ కు మూడు రోజులు, ఒడిశాకు రెండు రోజులు, మొత్తంగా ఈస్ట్ ఇండియాకు రాబోయే 3-5 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ను ఐఎండీ జారీ చేసింది.

‘‘మే 5 వ తేదీ తరువాత ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గుతాయని మేము అంచనా వేస్తున్నాము…’’ అని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ పేర్కొన్నారు. మే 4 నుండి రెండు, మూడు రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 

తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మే 5 – 8 మధ్య ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ, మాహే లలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రానున్న 3 రోజుల్లో రాయలసీమలో తీవ్రమైన వడగాల్పులు, ఆ తర్వాత 2 రోజుల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక, కోస్తాంధ్ర, యానాంలో వచ్చే 4-5 రోజుల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మే 1, 2 తేదీల్లో కేరళలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మే 1-3 తేదీల్లో తమిళనాడులో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

ఐఎండీ గరిష్ట ఉష్ణోగ్రత అంచనాలు

  • రాబోయే 24 గంటల్లో వాయువ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలలో గణనీయమైన మార్పు లేదు. ఆ తర్వాత 4-6 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుంది.
  • వచ్చే 48 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు ఉండదని, ఆ తర్వాత 2-3 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుందని తెలిపింది.
  • వచ్చే 3 రోజుల్లో మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది.
  • వచ్చే 48 గంటల్లో పశ్చిమ భారతంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు ఉండవని, ఆ తర్వాత 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందన్నారు.