రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్​‌ విముక్తికై బిజెపికి ఓటు

రజాకార్ల గుప్పిట్లో  నుండి హైదరాబాద్​‌ విముక్తికై బిజెపికి ఓటు
* తెలంగాణాలో 12 సీట్లు ఖాయం .. అమిత్ షా ధీమా
40 ఏళ్ల రజాకార్ల పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపిస్తూ రజాకార్ల గుప్పిట్లో చిక్కుకుపోయిన హైదరాబాద్​‌కు విముక్తి కలగాలంటే ఈసారి బీజేపీకే ఓటు వేయాలని ఓటర్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. మజ్లిస్‌కు కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో తిరుగులేని శక్తిగా ఉన్న మజ్లిస్ స్థానంలో బిజెపి జెండా ఎగురవేసేందుకు బుధవారం రాత్రి భారీ రోడ్ షో నిర్వహించారు. 
 
మజ్లిస్ ఇలాఖా అంతా కాషామయంగా మారింది. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్న మాధవీ లతకు మద్దతుగా ఈ రోడ్ షో నిర్వహించారు. పాతబస్తీకి చేరుకున్న అమిత్ షా తొలుత చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లాల్ దర్వాజ నుంచి సుధా టాకీస్ వరకు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు మాధవీలతకు మద్దతుగా అమిత్‌షా రోడ్ షోలో పాల్గొన్నారు.
 
లాల్ దర్వాజా మహంకాళి ఆలయం నుంచి శాలిబండ సుధా టాకీస్‌ వరకు అమిత్‌ షా రోడ్‌ షో కొనసాగింది. అడుగడుగున పెద్ద ఎత్తున జనం నీరాజనం పలికారు. పలువురు మహిళలు బోనాలుతో ఎదురై, స్వాగతం పలికారు.  పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని 400 సీట్లలో గెలిపించాలని, ప్రధాని నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు. పాతబస్తీలో పాతుకుపోయి ఉన్న ఎంఐఎంకు ధీటుగా ఇప్పుడు బీజేపీ కూడా అభ్యర్థి ఎంపిక నుంచి ఎన్నికల ప్రచారంలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

రోడ్ షోలో బిజెపి నాయకులతో కిక్కిరిసింది. రోడ్ షో దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ మాధవీ లతకు మద్దతు ఇచ్చి గెలిపించాలని అభ్యర్థించారు. జై శ్రీరామ్, జై హింద్ నినాదాలతో ముందుకు సాగారు. పాత బస్తీ రోడ్లన్నీ బిజెపి కార్యకర్తలు,నాయకులతో నిండిపోయింది. 

రోడ్ షో ముగిసే సరికి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాత్రి పది గంటల సమయం కావడంతో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై రెండే రెండు నిమిషాలు హడావుడిగా ప్రసంగించి ముగించారు. గత 40 ఏళ్లలో మజ్లిస్‌పాలనలో పాతబస్తీ ఏమాత్రం బాగుపడలేదని, బిజెపి అభ్యర్థి, సోదరి మాధవీలతను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపిచ్చారు. అమిత్ షా వెంట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, అభ్యర్థి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.

రోడ్‌ షో ముగించుకుని అమిత్ షా నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ పార్టీ సీనియర్‌ నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, కన్వీనర్లు, జిల్లా అధ్యక్షులతో అమిత్‌ షా సమావేశమయ్యారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ప్రచార సరళిని సమీక్షించారు. ఎన్నికలకు మరో పదిరోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రచారం మరింత ఉధృతంగా కొనసాగించాలని ఆదేశించారు. డబుల్‌ డిజిట్‌ స్థానాలు కైవసం చేసుకోవడంలో భాగంగా అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో బీజేపీ 12 సీట్లు ఖాయంగా గెలుచుకోబోతోందని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. మరో మూడు స్థానాల్లో గట్టి పోటీ ఉందని, స్థానిక నాయకత్వం కష్టపడితే వాటిలో కూడా అద్భుతం జరుగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ అనూహ్య స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో ప్రతి కార్యకర్త, తన కుటుంబంతోపాటు మరో మూడు కుటుంబాలను ప్రభావితం చేసేలా కష్టపడి పనిచేయాలని సూచించారు.