ఢిల్లీ పోలీసులను 4 వారల గడువు కోరిన రేవంత్ రెడ్డి

ఢిల్లీ పోలీసులను 4 వారల గడువు కోరిన రేవంత్ రెడ్డి

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసులో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై పీసీసీ లీగల్​ సెల్​ నేతలు వివరణ ఇచ్చారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో స్టార్​ క్యాంపెయినర్ ​ అయిన ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తీరిక లేకుండా ఉన్నందున నాలుగు వారాల గడువు కావాలని ఢిల్లీ పోలీసులను కోరినట్లు లీగల్​ సెల్ నాయకులు తెలిపారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసులో ఇటీవలే గాంధీభవన్​లో పోలీసులు నోటీసులిచ్చారు. బుధవారం ఢిల్లీలో తమ ముందు హాజరుకావాలని అందులో తెలిపారు. రేవంత్​ రెడ్డి సహా పీసీసీ సామాజిక మీడియా ఛైర్మన్​ మన్నెే సతీశ్​, నవీన్, శివకుమార్​, అస్మా తస్లీమ్​కి దిల్లీ పోలీసులు నోటీసులు అందించారు.

ఐతే సాంకేతికపర అంశాలని పూర్తిస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉన్నందున లీగల్​ సెల్​ ఛైర్మన్​ మన్నే సతీశ్​, మరో ముగ్గురికి రెండు వారాలు గడువు కావాలని కోరినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్​ రెడ్డి లోక్​సభ ఎన్నికల్లో స్టార్​ క్యాంపెయినర్​గా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తున్నందున బుధవారం విచారణకు రాలేరని తెలిపారు.

మరోవంక, అమిత్ షా ఫేక్‌ వీడియో వైరల్ కావటానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు రేవంత్ సమాధానం పంపించారు. ఆ వీడియో పోస్టు చేసిన ఐఎన్సి  తెలంగాణ ట్విట్టర్ (ఎక్స్‌) ఖాతాను తాను నిర్వహించడం లేదని చెప్పారు. తాను కేవలం రెండు ట్విట్టర్‌ ఖాతాలను (సీఎంవో తెలంగాణ, వ్యక్తిగత ఖాతా) మాత్రమే వినియోగిస్తున్నానని ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపించారు.

కాగా, కాంగ్రెస్​ సోషల్​ మీడియా కార్యకర్త గీత ఫోన్​ను ఢిల్లీ పోలీసులు జప్తు చేశారు. సికింద్రాబాద్​ శాంతినగర్​కు చెందిన గీతకు 41ఏ నోటీసులు ఇచ్చి, ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈనెల 23వ తేదీన తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్​ షా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఆ హక్కులను తిరిగి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చేస్తామని తెలిపారు. 

కానీ కొంత మంది ఆ మాటలను వక్రీకరించి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్​ షా చెబుతున్నట్లు ఎడిట్​ చేశారని కేంద్ర హోంశాఖ, బీజేపీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా మాటలను వక్రీకరించారని, ఫేక్​ వీడియోను సోషల్​ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేశారనే అభియోగంతో సీఎం రేవంత్​ రెడ్డి సహా మరో నలుగురు కాంగ్రెస్​ నేతలకు ఢిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు.

ఈ నోటీసులను నేరుగా గాంధీభవన్​కు పంపించారు. మే 1వ తేదీన విచారణకు హాజరుకాని పక్షంలో సీఆర్​పీసీ 91/160 కింద క్రిమినల్​ ప్రొసీడింగ్స్​ ప్రకారం చర్యలు తీసుకుంటామని అందులో వివరించారు. ఢిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం వారు ఏప్రిల్​ 28న ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 153, 153ఏ, 465, 469, 171జీ సెక్షన్ల కింద ఎఫ్​ఐఆర్​ ప్రకారం నోటీసులు ఇచ్చారు. 

మరోవంక, జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో జరిగిన కాంగ్రెస్​ జనజాతర సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ నోటీసుల అంశంపై ఘాటుగానే స్పందించారు. రిజర్వేషన్ల రద్దుపై తాను ప్రశ్నించినందుకు, బీజేపీ నేతలు ఈడీ ఐటీ సీబీఐతోనే కాకుండా ఢిల్లీ పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లపై మాట్లాడుతుంటే తనపై దేశ హోంమంత్రే కేసు పెట్టారని విమర్శించారు.