రాహుల్ అమేథీలో కులతత్వం పేరుతో విభజిస్తారు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల 26 తరువాత అమేథీకి వచ్చి, కులతత్వం పేరిట ప్రజలను విభజిస్తారని, ఒకదాని తర్వాత ఒకటిగా ఆలయాలను సందర్శిస్తారని కేంద్ర మంత్రి, స్థానిక ఎంపి స్మృతి ఇరానీ సోమవారం ఆరోపించారు. అమేథీలోని భేతువా, భాదర్ ప్రాంతాల్లో తన ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు పక్క సభల్లో స్మృతి ఇరానీ ప్రసంగించారు. 

 ‘26న వయనాడ్‌లో వోటింగ్ పిమ్మట రాహుల్ గాంధీ అమేథీ తన కుటుంబం అని ప్రతి ఒక్కరికీ చెప్పేందుకు ఇక్కడికి వస్తారు. ఇక్కడ సమాజంలో కులతత్వం జ్వాలలు రగిల్చేందుకు ప్రయత్నిస్తారు’ అని చెప్పారు. ‘రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి ఆహ్వానాన్ని తిరస్కరించినా అమేథిలో ఆలయాలను ఆయన సందర్శిస్తుండడం చూడవచ్చు. కనుక జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండడం అవసరం’ అని ఆమె ప్రజలను హెచ్చరించారు. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అమేథిలో అనూహ్య పరాజయం ఎదురైంది. 15 ఏళ్ల పాటు సీటును నిలబెట్టుకుంటూ వచ్చిన రాహుల్ నుంచి స్మృతి అమేథిని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అమేథీ సీటుకు తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.  కానీ మళ్లీ పోటీ చేయవలసిందిగా రాహుల్‌కు స్థానిక పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో అమేథీ సమస్యలను ఎన్నడూ ప్రస్తావించలేదని, తరచు సభ నుంచి అదృశ్యం అవుతుంటారని కూడా స్మృతి ఇరానీ ఆరోపించారు. 

రాహుల్ గాంధీ 15 ఏళ్ల పాటు ఎంపిగా ఉన్నప్పటికీ అమేథిలో ప్రజలకు తాగు నీరు కూడా లభించలేదని ఆమె ఆరోపించారు. నరేంద్ర మోదీ  అధికారంలోకి వచ్చిన తరువాతే అమేథి వాసులకు తాగునీటి సరఫరా జరిగిందని స్మృతి తెలిపారు.