
* ఏఐఎంఐఎం కోటల్లో బీటలు తప్పవా?
హైదరాబాద్ జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో గత ఏడాది జనవరి నుంచి ఎన్నికల అధికారులు దాదాపు 5 లక్షలకు పైగా నకిలీ ఓట్లను తొలగించారు. అయితే ఈ ఓట్లన్నీ మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలకు చెందినవి కావడంతో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఏఐఎంఐఎం నేతలు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్లలు ఉండగా ఎంఐఎం పార్టీ చేతిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవే కాకుండా మరో మూడు నియోజకవర్గాల్లో మైనారిటీ ఓట్లు కీలకంగా మారాయి. అయితే నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలు మార్లు పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఎప్పటి నుంచో బోగస్ ఓట్లపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బోగస్ ఓట్ల తొలగింపుపై ఫిరోజ్ ఖాన్ యుద్ధం మొదలు పెట్టారు. చివరకు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఆయనతో పాటు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపల్లి మాధవి లత సహితం నకిలీ ఓట్లను తొలగించాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగి హైదరాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బోగస్ ఓట్లపై దృష్టి పెట్ నకిలీ ఓట్లను తొలగించింది. ఇలా తొలగించిన ఓట్లలో అధిక శాతం మజ్లిస్ ప్రభావిత ప్రాంతాలలోనే ఉండడంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నేతలలో కలకలం చెలరేగుతుంది.
బోగస్ ఓట్లు అత్యధికంగా నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నట్టు ఎన్నికల అధికారులు గుర్తించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 21,407 నకిలీ ఓటర్లు ఉండడంతో వారిని జాబితా నుంచి తొలగించారు. తొలగించిన వారిలో 15,963 మంది ఇండ్లు మారగా, 2,843 మంది ఓటర్లు చనిపోయారు. మరో 2,601 మంది డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించారు.
నాంపల్లితో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం లో 21,222 బోగస్ ఓటర్లను ఎన్నికల అధికారులు తొలగించారు. వీటిలో 16,658 మంది నివాసం మారినవారు ఉండగా 3,754 మంది బోగోస్ ఓటర్లు, 810 మంది చనిపోయిన వారు ఉన్నారు. ఇక కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 20,722 మందిని జాబితా నుంచి తొలగించారు. వీరిలో 12,527 మంది ఇండ్లు మారగా,. 487 మంది బోగోస్ ఓటర్లు ఉన్నారు. మరో 350 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తించి వారిని జాబితా నుంచి తొలగించారు.
ఇవే కాకుండా పాత బస్తి పరిధిలోని చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా పరిధిలో బోగస్ ఓట్లను అధికారులు పెద్ద మొత్తంలో తొలగించడంతో దీని ప్రభావం వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై చూపే అవకాశం ఉంది. సుమారు 15 నెలలుగా జిల్లాలో బోగస్ ఓట్ల తొలగింపునకు ఎన్నికల అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు వేయని వారు, ఇండ్లు మారిన వారు, చనిపోయిన వారిని గుర్తించి వారిని ఓట్ల జాబితా నుంచి తొలగించారు. 2023 జనవరి నుంచి హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 5,41,259 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వీరిలో 47,140 మంది మరణించారని, 4,39,801 మంది ఇండ్లు మారారని, మరో 54,259 నకిలీ ఓటర్లు ఉన్నారని అధికారులు గుర్తించారు.
ఈ ఏడాది జనవరిలో సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం హైదరాబాద్ జిల్లాలోని అన్నీ సెగ్మెంట్లలో కలిపి సుమారు 45.7 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇది గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 33 వేలకు పైగా అధికం. అయితే ఇటీవలే ఎన్నికలు ముగిసిన తర్వాత అధికారులు పోలింగ్ కు హాజరు కాని ఇండ్ల పై ప్రత్యేక దృష్టి పెట్టారు.
హైదరాబాద్ జిల్లాలో ఇండ్లు మారిన వారు, చనిపోయిన వారు మొత్తం 1,09,117 ఓట్లు తొలగించారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా సగటు ఓటర్ల జాబితా నిష్పత్తి 68 శాతంగా ఉంటే హైదరాబాద్ జిల్లాల్లో ఇది 75.3 శాతంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం లక్షలకు పైగా ఓట్లు తొలగించకుండా ఉంటే ఇది మరింత అధికంగా ఉండేది.
భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం ఫారం 7, ఫారం 8 ప్రకారమే ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఇంకా ఓటరు జాబితా ప్రక్షాళన సమయంలో చాలామంది ఓటర్ల జాబితాలపై ప్రామాణికం కానీ ఇంటి నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అటువంటి ఓటర్లను గుర్తించి సవరణలు చేయడానికి ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టారు. దీని ప్రకారం మొత్తం 1,81,405 ఓటర్లు నాన్ స్టాండర్డ్ ఇంటి నెంబర్లు గుర్తించి వారి ఇంటి నెంబర్లలో అధికారులు సవరణలు చేశారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన