పోస్టల్ బ్యాలెట్ కు 26 వరకు పొడిగింపు

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్‌ బ్యాలెట్‌ (ఫారమ్‌ నెంబరు 12)ను సమర్పించే తేదీని ఈ నెల 26 వరకు పొడిగించినట్లు సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ నెల 22 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ సమర్పించేందుకు చివరి తేదీ అనే ప్రచారంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

ఇప్పటి వరకు చాలా మందికి పోస్టల్‌ బ్యాలెట్లు అందకపోవడం, ఏ జిల్లాలో ఓటు వేయాలో లేదా ఏ నియోజకవర్గంలో సమర్పించాలో తెలియక చాలా మంది ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది.  ఈ నేపథ్యంలో సిఇఒ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడే ఫారం-12ను పూర్తి చేసి, అక్కడే సమర్పించాల్సి ఉంటుంది. ఇతర జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఫస్ట్‌ సెంట్రల్‌ ఎక్స్ఛేంజ్‌ను ఈ నెల 28న సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. 

ఎక్స్ఛేంజ్‌-2 ఓటు వేయని పోస్టల్‌ బ్యాలెట్లు మే 3న, మే 8న ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఉపయోగించని బ్యాలెట్లు, మిగిలిపోయిన వాటిని మే 10న వెలగపూడిలోని కలెక్టర్ల సమావేశం హాలులో నోడల్‌ అధికారులకు అప్పజెప్పి రసీదులు తీసుకోవాల్సి ఉంటుందని సిఇఒ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

మే 8లోపు ఓటు హక్కు వినియోగించుకోని వారు తర్వాత ఓటు హక్కును వినియోగించుకునే హక్కు ఉండదని పేర్కొన్నారు. అన్ని బ్యాలెట్‌ పేపర్లు అనెగ్జర్‌-6తో సహా వాటిని స్ట్రాంగ్‌ రూమ్స్‌లో భద్రపరచాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.