సూరత్ ఎంపీగా బిజెపి అభ్యర్థి పోటీలేకుండా ఎన్నిక

ఇంకా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాకుండానే భారతీయ జనతా పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికలలో ఒక సీటు గెల్చుకుంది. గుజరాత్ లోని సూరత్ లో పార్టీ అభ్యర్థి ముఖేష్ దలాల్ అనూహ్యంగా ఏకగ్రీవంగా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలపై తాము సంతకం చేయలేదని అతని ప్రతిపాదకులు పేర్కొనడంతో రిటర్నింగ్ అధికారి ముందుగా ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు.
 
నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన సోమవారం బిఎస్‌పికి చెందిన ప్యారేలాల్ భారతితో సహా మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీ నుండి ఉపసంహరించుకున్నారు. దానితో బిజెపి అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి జిల్లా రిటర్నింగ్ అధికారి సౌరభ్ పార్ధి ప్రకటించారు. 
 
సూరత్‌లోని ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురికావడంతో గుజరాత్ కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.  నామినేషన్ ఫారమ్‌పై సంతకం చేయలేదని అతని ముగ్గురు ప్రతిపాదకులు జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
 
కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేసిన మరో అభ్యర్థి సురేష్ పద్సాలా కూడా అటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. దానితో గుజరాత్ లో కీలకమైన సూరత్ నగరంలో ఎన్నికల రంగం నుండి కాంగ్రెస్ నిష్క్రమించాల్సి వచ్చింది. 
 
బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నికల ఏజెంట్ దినేష్ జోధానీ తొలుత ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం తలెత్తింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ తన నామినేషన్ పత్రంపై గల సంతకాల ప్రామాణికతను చేతివ్రాత నిపుణుడి చేత నిర్ధారించారు.  అయితే, రిటర్నింగ్ అధికారి అఫిడవిట్‌లు, పరిశీలన సమయంలో సమర్పించిన అదనపు ఆధారాల ఆధారంగా తిరస్కరణలను ధృవీకరించారు.
 
ఇదిలా ఉండగా, ఓటమిని పసిగట్టిన బీజేపీ వత్తిడి మేరకు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తిసింగ్ గోహిల్ ఆరోపించారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందని ఆయన చెప్పారు.