బెంగాల్‌లో 25,753 మంది టీచ‌ర్లు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం

బెంగాల్‌లో  25,753 మంది టీచ‌ర్లు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం
బెంగాల్‌లోని మ‌మ‌తా బెన‌ర్జీ స‌ర్కారుకు భారీ షాక్ త‌గిలింది. కోల్‌క‌తా హైకోర్టు ఇవాళ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. 2016లో జ‌రిగిన టీచ‌ర్ల‌ రిక్రూట్మెంట్‌ను ర‌ద్దు చేసింది. ప్ర‌భుత్వ‌, ఎయిడెడ్ స్కూళ్ల‌కు జ‌రిగిన అపాయింట్మెంట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు కోల్‌క‌తా హైకోర్టు తెలిపింది. కోర్టు ఆదేశాల ప్ర‌కారం.. సుమారు 25,753 మంది టీచ‌ర్లు త‌మ ఉద్యోగాల‌ను కోల్పోయే అవ‌కాశాలు ఉన్నాయి. 

ఆ ఉద్యోగాలు ఇన్నాళ్లు తీసుకున్న జీతాన్ని కూడా వెన‌క్కి ఇవ్వాల్సి ఉంటుంది. 12 శాతం వ‌డ్డీతో ఆ మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంద‌ని కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. జ‌స్టిస్ దేబాన్సు బాస‌క్‌, మ‌హ‌మ్మ‌ద్ ష‌బ్బార్ ర‌షీద్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది.  చట్టవిరుద్ధంగా నియామకాలు జరిగాయని, మోసపూరితంగా ఖాళీ ఓఎంఆర్ షీట్లు సమర్పించిన అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని హైకోర్ట్ తేల్చింది.

అయితే నాలుగు వారాల్లోగా టీచ‌ర్లు త‌మ జీతాల‌ను వెన‌క్కి ఇచ్చేయాల‌ని కోర్టు ఆదేశించింది. ఆ టీచ‌ర్ల నుంచి డ‌బ్బును వ‌సూల్ చేసే బాధ్య‌త‌ల‌ను జిల్లా మెజిస్ట్రేట్ల‌కు క‌ల్పించారు. అయితే, మానవతా కారణాలతో ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స పొందుతున్న సోనా దాస్ అనే ఉపాధ్యాయుని మాత్రం ఉద్యోగంలో కొనసాగింపుమని హైకోర్టు తెలిపింది.

“ఓఎంఆర్​ షీట్లను నింపకుండా సబ్మీట్​ చేసి, అక్రమంగా ఉపాధ్యాయ ​ ఉద్యోగాన్ని సంపాదించిన వారందరు.. నాలుగు వారాల్లో, ఇప్పటివరకు తీసుకున్న జీతాలు తిరిగిచ్చేయాలి. టీచర్ల నుంచి డబ్బులు సేకరించే బాధ్యత జిల్లా మెజిస్ట్రేలకు అప్పగిస్తున్నాము,” అని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధమని మండిపడ్డ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తామని ఉద్ఘాటించారు. ఉద్యోగులు కోల్పోయిన వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
మరోవైపు నియామక ప్రక్రియపై తదుపరి విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని కూడా హైకోర్ట్ ఆదేశించింది. ఇక తాజాగా నియామక ప్రక్రియను మొదలుపెట్టాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్ఎస్‌‌సీ)ని కూడా కోరింది. కోల్‌కతా హైకోర్టు తీర్పును తాముపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని రాష్ట్ర స్కూల్‌ సర్వీస్‌ కమిషన్ ప్రతినిధి మజుందార్‌ మీడియాకు వెల్లడించారు.

హైకోర్టు ఇచ్చిన 300 పేజీల తీర్పును సమగ్రంగా చదివి, అర్థం చేసుకుని న్యాయపరమైన అంశాలపై చర్చిస్తామని, ఆ తర్వాత హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తామని తెలిపారు. కాగా, 2016లో మమతాబెనర్జి ప్రభుత్వం ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 వేలకుపైగా ఉపాధ్యాయులను నియమించింది. స్టేట్‌ లెవల్‌ సెలెక్షన్‌ టెస్ట్‌ ద్వారా ఈ నియామకాలు చేపట్టింది. అయితే ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో కేసు కోర్టుకు వెళ్లింది. 

ఈ ఉపాధ్యాయ నియామక స్కామ్​ కేసు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​ను గత కొన్నేళ్లుగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సహా అనేక మంది టీఎంసీ నేతలు, ప్రభుత్వ అధికారులు ఇదే కేసులో జైలులో ఉన్నారు. తీర్పు తర్వాత టీచర్​ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కంట తడి పెట్టుకున్నారు. “ఇన్నేళ్లుగా.. ఇదే తీర్పు కోసం ఎదురుచూస్తున్నాము. మొత్తానికి మాకు న్యాయం జరిగింది,” అని కోల్​కతా హైకోర్టు ఎదుట సంబరాలు చేసుకున్నారు.