యుద్ధాల వేదికగా మారిన అంతరిక్షం

యుద్ధాల వేదికగా మారిన అంతరిక్షం

అంతరిక్షం కూడా యుద్ధాలకు వేదికగా మారిందని తాను విశ్వసిస్తున్నట్టు భారత త్రివిధ దళాల అధిపతి (సిడిఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. గగనతల, సముద్ర, భూభాగాలపై దీని ప్రభావం తప్పక ఉంటుందని తెలిపారు. ఢిల్లీలో మూడు రోజుల పాటు జరగనున్న ఇండియన్ డిఫెన్స్ స్పేస్ సింపోజియమ్ 24 కార్యక్రమంలో వీడియో ద్వారా ప్రసంగం చేసిన ఆయన  ‘అంతరిక్ష దౌత్యం’ అనేది త్వరలోనే వాస్తవ రూపం దాలుస్తుందని పేర్కొన్నారు. 

భవిష్యత్ యుద్ధాల్లో రోదసీ పాత్ర గురించి సీడీఎస్ ప్రముఖంగా ప్రస్తావించారు. “అంతరిక్షం అనేది చివరి సరిహద్దు. దాని విస్తీర్ణం అనంతం. అది పెరుగుతూనే ఉంది. ఇతర సరిహద్దుల మాదిరిగా దాని ఎల్లలను స్పష్టంగా నిర్వచించడం కష్టం. రోదసీ రహస్యాలను ఛేదించేందుకు మానవుడు ఎంతో దూరం వెళ్లాల్సి ఉంది. ఆ ప్రయాణంలో భారత్ కూడా భాగం కావాలని కోరుకుంటోంది” అని తెలిపారు. 

“భవిష్యత్ యుద్ధాలకు అంతరిక్షాన్ని ఓ వేదికగా పరిగణిస్తుంటారు. ఇప్పటికే అది స్థాపించబడిందని విశ్వసిస్తున్నా. గగనతలం, సముద్ర భూభాగంపైనా దీని ప్రభావం ఉంటుంది” అని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. స్పేస్ అనేది గ్లోబల్ కామన్స్‌గా పేర్కొన్న చౌహాన్, అక్కడ సార్వభౌమాధికారం అనే భావన ఉండదని స్పష్టం చేశారు.

మిత్రదేశాలకు సహకారం అందించాలనుకుంటే ఓ పొరుగు దేశంగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతరిక్ష రంగంలో ఇప్పటివరకు ఇతర దేశాల నుంచి సేవలు పొందుతోన్న భారత్, ప్రపంచ దేశాలకు సేవలందించే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు.

 మరోవైపు భారత్ చేపట్టనున్న గగన్‌యాన్ కార్యక్రమానికి సంబంధించి నలుగురు వ్యోమగాములకు శిక్షణ కొనసాగుతోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్, డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) ఛైర్మన్ పీవీ కామత్, సాయుధ దళాలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.