వైమానిక పోరులో అజేయం ఇజ్రాయిల్ సామర్థ్యం

వైమానిక పోరులో అజేయం ఇజ్రాయిల్ సామర్థ్యం

సిరియాలో జ‌రిగిన దాడికి ప్ర‌తీకారంగా ఇజ్రాయిల్‌పై ఇరాన్ క్షిప‌ణులు, డ్రోన్ల‌తో దాడి చేయడం, వాటిని ఇజ్రాయిల్ ప్రతిఘటించడంతో ఈ రెండు దేశాల వైమానిక పోరాట సామర్థ్యంపై ఆసక్తి నెలకొంటుంది.   వంద‌ల సంఖ్య‌లో డ్రోన్లు, క్షిప‌ణుల‌తో ఇజ్రాయిల్‌పై ఇరాన్ దాడి చేయగా, ఇజ్రాయిల్ ధీటుగా కూల్చివేసింది. 

దానికి సంబంధించిన వీడియోను ఇజ్రాయిల్ రిలీజ్ చేసింది. సుమారు 300 వ‌ర‌కు డ్రోన్లు, క్షిప‌ణులను ఇరాన్ వ‌ద‌లిన‌ట్లు తెలుస్తోంది. దాంట్లో 99 శాతం ఆయుధాల‌ను తాము అడ్డుకున్న‌ట్లు ఇజ్రాయిల్ చెప్పింది. భౌగోళికంగా ఇజ్రాయిల్ క‌న్నా ఇరాన్ చాలా పెద్ద‌ది. ఇరాన్ జ‌నాభా సుమారు 9 కోట్లు ఉంటుంది. ఇజ్రాయిల్ క‌న్నా ప‌ది రెట్లు ఎక్కువ‌. 

కానీ ఇది ఆ దేశాన్ని సైనిక శ‌క్తి విష‌యంలో బ‌లంగా చూపించ‌లేక‌పోతున్న‌ది. మిస్సైళ్లు, డ్రోన్ల‌పైనే ఎక్కువ ఇరాన్ త‌న పెట్టుబ‌డులు పెట్టింది. ఆ దేశం వ‌ద్ద ఆయుధాలు చాలా ఉన్నాయి. ప్రాక్సీ వార్ కొన‌సాగిస్తున్న వారికి ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. యెమెన్‌లోని హౌతీలు, లెబ‌నాన్‌లోని హిజ్‌బుల్లాల‌కు ఇరాన్ నుంచి ఆ ఆయుధాలు వెళ్తున్నాయి.

అయితే ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్‌తో పాటు ఫైట‌ర్ జెట్స్ విష‌యంలో ఇరాన్ వెనుక‌బ‌డి ఉన్న‌ది. ఈ ప్రాంతంలో అభివృద్ధి కొన‌సాగించేందుకు ఇరాన్‌కు ర‌ష్యా స‌హ‌క‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో ర‌ష్యా చేస్తున్న యుద్ధానికి ప‌రోక్షంగా ఇరాన్ స‌హ‌క‌రిస్తున్న‌ది. ఆ దేశం త‌యారు చేసిన షాహిద్ డ్రోన్‌ల‌ను ర‌ష్యాన్లు ఎక్కువ‌గా వినియోగిస్తున్నారు. ప్ర‌స్తుతం ర‌ష్యానే ఆ డ్రోన్ల‌ను ఉత్ప‌తి చేస్తున్న‌ట్లు చెప్పారు.

ప్ర‌పంచంలోనే అత్యాధునిక వైమానిక ర‌క్ష‌ణ క్షేత్రం ఇజ్రాయిల్ వ‌ద్ద ఉన్న‌ది. ఐఐఎస్ఎస్ మిలిట‌రీ లెక్క‌ల ప్ర‌కారం.. ఇజ్రాయిల్ వ‌ద్ద 14 స్వ్కాడ్ర‌న్ల విమానాలు ఉన్నాయి. దాంట్లో ఎఫ్‌15, ఎఫ్‌16, ఎఫ్‌-35 జెట్ విమానాలు కూడా ఉన్నాయి. ప్ర‌త్య‌ర్థి లొకేష‌న్‌లోకి చొచ్చుకువ‌చ్చి క‌చ్చిత‌త్వంతో దాడులు చేయ‌డం ఇజ్రాయిల్‌కు వెన్న‌తో పెట్టిన విద్య అని తెలుస్తోంది.

అమెరికా, జోర్డాన్‌, బ్రిట‌న్‌తో పాటు ఇత‌ర దేశాల స‌హ‌కారంతో ఆ దాడిని నిలువ‌రించిన‌ట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్ల‌డించింది. ఏరియ‌ల్ డిఫెన్స్ సిస్ట‌మ్‌కు చెందిన ఆప‌రేష‌నల్ ఫూటేజ్‌ను ఐడీఎఫ్ ద‌ళాలు రిలీజ్ చేశాయి. ఎక్స్ అకౌంట్‌లో ఆ వీడియోను పోస్టు చేశాయి. అయితే, అరబ్‌ దేశమైన జోర్డాన్‌ ఇరాన్ డ్రోన్ల కూల్చివేతలో ఇజ్రాయెల్‌కు సహకరించడం విస్మయం కలిగిస్తుంది.

పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను ఖండించిన జోర్డాన్‌ అనూహ్యంగా ఆ దేశానికి మద్దతు ఇచ్చింది. తమ భూభాగం మీదుగా ఇజ్రాయెల్‌ వైపు దూసుకెళ్లే డ్రోన్లను జోర్డాన్‌ ఆర్మీ కూల్చివేసింది. ఇరాన్‌ డ్రోన్లను కూల్చివేతపై జోర్డాన్‌ వివరణ ఇస్తూ ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అంతే తప్ప ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి కాదని వివరించింది.

జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమన్ సఫాది దీని గురించి మాట్లాడారు. తాము ఫైర్‌ రేంజ్‌లో ఉన్నట్లు తెలిపారు. ‘ఏదైనా క్షిపణి లేదా డ్రోన్‌ జోర్డాన్‌ భూభాగంలో పడితే మాకు హాని కలుగుతుంది. అందుకే మేం చేయాల్సింది చేశాం. ఇరాన్‌, ఇజ్రాయెల్ లేదా మరే దేశం వైపు నుంచి డ్రోన్లు, క్షిపణులు వచ్చినా అదే పని చేస్తాం’ అని పేర్కొన్నారు.

కాగా, ఆర్థికంగా, సైనికపరంగా బలహీనమైన జోర్డాన్‌ 309 కిలోమీటర్ల మేర ఇజ్రాయెల్‌తో సరిహద్దు కలిగి ఉంది. గతంలో పలు యుద్ధాలు చేసిన జోర్డాన్‌, 1994లో ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఇజ్రాయెల్‌ సైనిక శక్తిగా ఎదగడంతో ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రికత్తల ముప్పు నుంచి కాపాడుకునే ప్రయత్నంలో సమతుల్యం పాటించినట్లు తెలుస్తున్నది. 

అలాగే అమెరికాతో జోర్డాన్‌కు ఆర్థిక, సైనిక సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు జోర్డాన్‌ ఈ మేరకు సహకరించినట్లు అంచనా వేస్తున్నారు.