వెండి నాణేలపై రామ్‌లల్లా

వెండి నాణేలపై రామ్‌లల్లా

అయోధ్య రామయ్య భక్తులకు గుడ్‌న్యూస్‌. అయోధ్యలో కొలువుదీరిన రామ్‌లల్లా చిత్రాలతో కూడిన వెండి నాణేలు అందుబాటులోకి రానున్నాయి. ముంబయి బులియన్‌ మార్కెట్‌ విడుదల చేయనున్నది. త్వరలోనే వ్యాపారులు నాణేలను తీసుకువచ్చి ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ప్రస్తుతం ముంబయి బులియన్‌ మార్కెట్‌తో సంబంధాలున్న వ్యాపారులు నాణేల రూపకల్పన, బరువు, లభ్యతపై ఏకాభిప్రాయం కుదిరింది. త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, దీనిపై బులియన్‌ మార్కెట్‌ వ్యాపారులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. 

రాంలల్లా చిత్రంతో కూడిన వెండి నాణేలు ఇప్పటికే వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లలో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 22న అయోధ్య రామాలయంలో బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కనుల పండువగా జరిగింది. ఆ తర్వాత రామ్‌లల్లాకు సంబంధించిన మూడు సావనీర్‌ నాణేలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. 

ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ యాజమాన్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీటిని విడుదల చేశారు. ఈ నాణేలపై రాంలాలా, రామజన్మభూమి ఆలయం, అయోధ్య ఇతివృత్తాలను తీర్చిదిద్దారు. ఈ నాణేలను 999 గ్రాముల స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు.

శ్రీరాముడి చిత్రంతో కూడిన నాణెం బ్రిటిష్ కాలంలో కూడా విడుదలైంది. 161 ఏళ్లనాటి ఈ నాణెంపై శ్రీరాముడి కుటుంబం చిత్రాన్ని ముద్రించారు. మీడియా కథనాల ప్రకారం.. ఈ నాణెం ఇప్పటికీ మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన రమేశ్‌ కొండల్కర్ వద్ద ఉన్నట్లు సమాచారం. 1862లో ఈస్ట్‌ఇండియా కంపెనీ హయాంలో ఈ నాణెం వెలువడిందని తెలుస్తున్నది.