
రాంపల్లి మల్లిఖార్జునరావు * ఉగాది పూర్వరంగం
గ్రహ నక్షత్ర గణనే నిజమైన కాలగణన. కాలం దైవ స్వరూపం. కాలం అనంతమైనది. ఈ సృష్టి అన్వేషణకు మూలం కాలగణనే. మనదేశంలో కాల గణన ఎంతో శాస్త్రీయమైనది. సూర్యుని కేంద్రంగా గ్రహాలన్నీ తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టి వస్తుంటాయి. నక్షత్రాలకు చలనము, కదలిక రెండు లేవు. అందుచేత నక్షత్రముల అనుసరించి గ్రహగతులను పరిశీలించి కాలాన్ని లెక్కిస్తారు.
ఈ సృష్టి ప్రారంభమై ఇప్పటికీ నూట తొంభఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఎనభై ఒక్క సంవత్సరం [195,58,85,082] అయినట్లు లెక్క తెలుస్తున్నది. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం చేప్పే లెక్క కూడా దాదాపుగా మన పంచాంగం చెప్పే లెక్కకు దగ్గర ఉన్నది. మన కాలగణనలో మన్వంతరము, యుగాలు, సంవత్సరాలు, అయనం, మాసాలు, పక్షము, రోజులు ఉంటాయి.
అందులో 14 మన్వంతరాలు ఉన్నాయి. ఆ మన్వంతరాల క్రమంలో ప్రస్తుతం ఏడవ మన్వంతరమైన వైవస్వత మన్వంతరం ఇప్పుడు నడుస్తున్నది. ఒక మన్వంతరము అంటే 71 మహా యుగాలు. ఒక మహాయుగం అంటే నాలుగు యుగాల మొత్తం. నాలుగు యుగాలు 1. కృతయుగము, 2. త్రేతాయుగము, 3. ద్వాపరయుగము, 4. కలియుగం. ఒక యుగంలో నాలుగు పాదాలు ఉంటాయి.
మనము ఇప్పుడు వైవస్వత మన్వంతరంలోని మహా యుగంలో చివరిదైన కలియుగంలో మొదటి పాదంలో ఉన్నాం. ఈ కలియుగం ప్రారంభమై ఇప్పటికీ 5125 సంవత్సరాలు పూర్తి అయ్యి ఈ ఉగాదితో 5126 లోప్రవేశిస్తున్నది. మన కాలగణనలో సంవత్సరాల ఆవర్తం ఉన్నది. ఒక ఆవర్తము అంటే 60 సంవత్సరాలు. ఆ 60 సంవత్సరాల ఆవర్తంలో 37వ సంవత్సరమైన శోభ కృత నామ సంవత్సరం పూర్తయి 38వ సంవత్సరమైన క్రోధి నామ సంవత్సరంలో ఈ ఉగాదితో ప్రవేశిస్తున్నాము.
కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది?
ఈ కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? ద్వాపర యుగ అంతంలో జరిగిన మహాభారత సంగ్రామం తరువాత 36 సంవత్సరాలకు కలియుగం ప్రారంభమైంది. కలియుగం ప్రారంభమైంది అని చెప్పటానికి ప్రమాణం ఏంటి? కలి శకం గ్రహ గమనాల ఆధారంగా చెప్పారు. కలియుగం ప్రారంభం రోజు ఆకాశంలో ఏడు గ్రహాలు మేష రాశిలో ఉన్నాయి. ఆ ఏడుగ్రహాలలో 1. శని, 2. గురువు, 3. కుజుడు, 4. సూర్యుడు, 5. శుక్రుడు,6. బుధుడు, 7. చంద్రుడు.
ఇప్పటి సాధారణ శకం కు పూర్వం 3101 సంవత్సరం, ఫిబ్రవరి 20వ తేదీ, అర్ధరాత్రి 2 గంటల 27 నిమిషాల 30 సెకన్లకు ప్రారంభమైంది. అంటే 3101 +2024 =5125 సంవత్సరాలు పూర్తిఅయి 5126 వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నది. కలియుగం ప్రారంభమైన రోజు అర్ధరాత్రి శ్రీకృష్ణునిచే నిర్మాణం చేయబడిన ద్వారకా పట్నం సముద్రంలో కలిసిపోయింది. అప్పటి నుండి ద్వాపరయుగము అంతమై, కలియుగం ప్రారంభమైంది. అందుకే మన కాలగణన ఎంతో శాస్త్రీయమైనది.
దేశ చరిత్ర లోని కొన్ని తిరుగులేని విజయాలే శకాలు
దేశ చరిత్ర లోని కొన్ని తిరుగులేని విజయాలను మనవాళ్ళు శకాలుగా వర్ణించారు. అందులో ప్రసిద్ధమైనవి 1. యుధిష్ఠిర శకము, 2. విక్రమార్క శకము, 3. శాలివాహన శకము. ద్వాపర యుగ అంతంలో యుధిష్ఠిర శకము ప్రారంభమైతే, కలియుగంలో విక్రమార్క శకము, శాలివాహన శకములను గుర్తించారు.
భారతదేశానికి ఉత్తర భాగంలో విశేషంగా విక్రమార్క శకం ప్రాచుర్యంలోఉంటే దక్షిణాపథంలో శాలివాహన శకము విశేషంగా ఉన్నది. ఈ దేశ చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనలో ధర్మ నిష్ఠ , పౌరుష పరాక్రమాలు , పెంపొందించుకోవడం ప్రధాన లక్ష్యంగా అవి మనకు కనబడతాయి. ఆ శకాల గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
యుధిష్ఠిర శకం
ద్వాపర యుగం అంతం లో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ధర్మరాజు సమ్రాట్ గా పట్టాభిషేకం జరిగిన రోజు నుండి యుధిష్ఠిర శకం ప్రారంభమైంది. అది కలియుగానికి పూర్వం 36 సంవత్సరం లో అంటే ఇప్పటికి (5124+36=5160)5159 సంవత్సరాలు పూర్తి అయి 5160వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు 36 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు. యుధిష్టర శకం మనకిచ్చే సందేశం ఏమిటి? ఎప్పుడైనా అంతిమ విజయం ధర్మానిదే. మహాభారత సంగ్రామం ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన భీకర పోరాటం అది ధర్మం జయించిన వేళ.
విక్రమార్క శకం
విక్రమార్క శకం కలియుగంలో 3044 సంవత్సరంలో ప్రారంభమైంది. అంటే 5125 -3044=2081 . 2080 సంవత్సరాలు పూర్తి 2081లో ప్రవేశిస్తున్నది. దానిని బట్టి సాధారణ శకంకు పూర్వం 57లోవిక్రమార్క శకం ప్రారంభమైంది. ఆ లెక్క ప్రకారం 2024 +57=2081 2080 పూర్తి అయి 2081లో ప్రవేశిస్తుంది.
2081 సంవత్సరాల పూర్వం ఉన్న విక్రమార్కుని కాలంలో భారతదేశం మీద శకులు దండయాత్రలు జరుగుతుండేవి. చిన్న వయసులోనే విక్రమార్కుడు ఆ దాడులను తిప్పి కొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభం చేశాడు. ఐదు సంవత్సరాల వయస్సులో విక్రమార్కుడు అరణ్యంలోకి వెళ్లి 12 సంవత్సరాల పాటు సుదీర్ఘ సాధన చేసే అద్భుత శక్తులు సంపాదించాడు. అతను మాళవ ప్రాంతంలోని ఉజ్జయనిని రాజధానిగా చేసుకుని పరిపాలన ప్రారంభించాడు.
ఉజ్జయిని మహాకాలుని దేవాలయం ఉన్నది. అది జ్యోతిర్లింగాలలో ఒకటి. విక్రమాదిత్యుడు శకులు, హుణులను జయించటానికి భయంకరమైన యుద్ధాలు చేశాడు. శకుల బాధ మనకే కాదు ఇప్పటి అరేబియా బాబిలోనియా, పర్షియా, దేశాలకు కూడా ఉండేది. ఆ దేశాల రాజుల పిలుపుపై విక్రమార్కుడు అక్కడికి కూడా వెళ్లి అక్కడినుండి శకులను తరిమివేసాడు.
అందుకే ఆ అరబ్ దేశాల ప్రజలు విక్రమాదిత్యుని తమకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదించిన రాజుగా కీర్తిస్తారు. అరేబియాలో మహా దేవుని మందిరం నిర్మాణం చేశాడు. అట్లాగే విక్రమార్కుడు అయోధ్య పట్టణంలో రాముడు జన్మించిన స్థలం గురించి అక్కడ భవ్యమైన రామమందిర నిర్మాణం చేశాడు. ఈ విషయాలన్ని కాళిదాసు రచించిన గ్రంథాలలో మనకు కనిపిస్తాయి. శకుల నుండి ఈ దేశాన్ని కాపాడిన విక్రమాదిత్యుని పేరుతో అప్పటి నుండి విక్రమార్క శకం ప్రారంభమైంది
శాలివాహన శకం
శాలివాహన శకం ఇది కలియుగంలో 3179 లో ప్రారంభమైంది. అంటే [5125 -3179=1946 ] ఇప్పడు 1946 లో ప్రవేశించింది. సాధారణ శకం లెక్కప్రకారం సాధారణశకం. 78 లో శాలివాహన శకం ప్రారంభమైనది, అంటే [2024 -78=1946 ] 1946లో ప్రవేశిస్తుంది. శాలివాహనుడు విక్రమాదిత్యుని మునిమనవడు. శాలివాహనుడు శకులను, చీనులను, తా ర్తారులను, బాహ్లికులను, కామరూపాదేశీయులగు కిరాతాది మ్లేచ్చులను రోమనులను, శట్లైన ఖోరాసదేశస్తులను జయించి వారుదోచుకొనిపోయిన ధనరాశులను తిరిగి స్వాధీనం చేసుకొని వారిని దండించాడు.
సింధునదికి తూర్పునగల భారత దేశమును ఆర్యస్థానమని సింధునదికి పశ్చిమాన గల దేశమును మ్లేచ్ఛ దేశమని హద్దులు ఏర్పరచి దిగ్విజయంగా విజయం సాధించిన వేళానుండి శాలివాహన శకం ప్రారంభమైనది. శాలివాహన శకం విక్రమశకం తరువాత 135 సంవత్సరాలకు ప్రారంభమైనది. శాలివాహనుడు ఈ దేశంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసుకుని ఒకే ఛత్రం కింద ఈ దేశాన్ని పాలించినవాడు. ఈ విజయానికి చిహ్నంగా శాలివాహన శకం ప్రారంభమైంది. ఆయన కాలంలో ఈ దేశంపై దాడి చేసిన విదేశీయులను సంపూర్ణంగా నాశనం చేసి భారతదేశాన్ని శక్తివంతం చేశాడు.
ఇటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకునేందుకు యుధిష్టర, విక్రమార్క, శాలివాహన శకాలు ఏర్పడ్డాయి. అవి ఇప్పుడు మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే 1000 సంవత్సరాలు భావ దాస్యాన్ని వదిలించుకుని హిందుత్వ జాగరణతో, జాతీయ పునరుజ్జీవనంతో, స్వాభిమానంతో ఈ దేశం ప్రపంచంలో నిలబడి, ప్రపంచానికి శాంతిబాటలు వేసే మరో కొత్త శకం ప్రారంభించు కోవాలని పిలుపు నిస్తున్నది. ఈ క్రోధి నామ సంవత్సరం అందరికీ అటువంటి ప్రేరణ ఇవ్వాలని కోరుకొంటూ అందరికి ఉగాది శుభాకాంక్షలు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!