బెంగాల్‌లో తుపాను బీభత్సం.. ఐదుగురు మృతి

బెంగాల్‌లో తుపాను బీభత్సం.. ఐదుగురు మృతి
పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో ఆకస్మిక తుఫాను విధ్వంసం సృష్టించింది. తుఫాన్‌ ధాటికి ఐదుగురు చనిపోగా, సుమారు 300 మందికిపైగా గాయపడ్డారు. 800కుపైగా ఇండ్లు నేలమట్టమయ్యాయి. బలమైన గాలులు వీయడంతో పలు చోట్ల చెట్లు కూలపోగా, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. రాజర్‌హత్‌, బర్నిష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి ప్రాంతాల్లో తుపాను తీవ్ర ప్రభావం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు.
 
తుపాను వార్తలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీకూడా విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ లో తన పోస్ట్‌లో, ప్రధానంగా జల్‌పైగురి జిల్లాలోని పలు ప్రాంతాల్లో తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. ఈదురు గాలుల వల్ల జిల్లా కేంద్రమైన పట్టణంతోపాటు మైనగురి తదితర పరిసర ప్రాంతాల్లో అపార నష్టం జరిగిందని తెలిపారు.
 
ఈ తుఫాను ధాటికి అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్‌ స్తంభాలు కూడా నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో రాజర్‌హట్, బర్నీష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని ఆమె వివరించారు.
 
‘ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ వర్షం, ఈదురు గాలులు జల్‌పైగురి-మైనాగురిలోని కొన్ని ప్రాంతాలలో విపత్తును కలిగించాయని తెలుసుకోవడం విచారకరం. ఇందులో ప్రాణ నష్టం జరిగింది. అనేక మంది గాయపడ్డారు, ఇళ్లు దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు మొదలైనవి నేలకొరిగాయి. జిల్లా, బ్లాక్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు, డీఎంజీ, క్యూఆర్‌టీ బృందాలు విపత్తు నిర్వహణ కార్యకలాపాలలో పాల్గొని సహాయాన్ని అందిస్తున్నాయి’ అని మమతా తెలిపారు.
 
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా ఏ మేర నష్టం జరిగిందో అనేదానిపై ఒక అంచనాకు వచ్చామని చెప్పారు.
 
 ‘జరిగిన అతిపెద్ద నష్టం ఏంటంటే ప్రాణ నష్టం. తుపానులో గాయపడ్డవారిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించాం. వారికి మెరుగైన చికిత్స అందుతుంది. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులకు నా ధన్యవాదాలు. వైద్యులు, నర్సులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. సహాయక చర్యలు ఇప్పటికే ముగిశాయి’ అని దీదీ ట్వీట్‌ చేశారు.
 
తుఫాన్ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు అవసరమైన సహాయం అందించామని కోరిన్నట్లు తెలిపారు. బాధితులకు తగు సహాయం అందించామని బెంగాల్ లోని బిజెపి కార్యకర్తలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.
 
మృతులను సేన్‌పరా నివాసి దిజేంద్ర నారాయణ్ సర్కార్ (52), పహర్‌పూర్‌లో నివాసి అనిమా బర్మన్ (45), పుతిమరి నివాసి జగన్ రాయ్ (72), రాజర్హత్ నివాలీ సమర్ రాయ్ (64)గా గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. గాయపడిన పలువురు ఆసుపత్రిలో చేరినట్లు ధూప్‌గురి ఎమ్మెల్యే నిర్మల్ చంద్ర రాయ్ తెలిపారు.