
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలు ఎదుర్కొంటున్న అకృత్యాలపై గళమెత్తి బసీర్‌హాట్ నుంచి బిజెపి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేఖా పాత్రను శక్తి స్వరూపిణిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, స్థానిక టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్, అతని అనుచరులు సాగిస్తున్న అకృత్యాలకు వ్యతిరేకంగా గళమెత్తిన రేఖా పాత్రను బిజెపి బసీర్‌హాట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా బిజెపి ఎంపిక చేసింది.
సందేశ్‌ఖాలీ గ్రామం ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మంగళవారం ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ఎన్కికల ఏర్పాట్లు, ఓటర్ల నుంచి బిజెపికి వస్తున్న మద్దతు గురించి అడిగితెలుసుకున్నారని బిజెపి నాయకులు తెలిపారు. రేఖా పాత్రను శక్తి స్వరూపిణిగా ప్రధాని మోదీ అభివర్ణిస్తూ ఆమె టిఎంసి నేతల దురాగతాలకు వ్యతిరేకంగా సాగించిన పోరాటాన్ని ప్రశంసించారు.
ఎన్నికల సన్నాహాలు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు. రేఖా అభ్యర్థిత్వంపై స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. బెంగాలీలో ఫోన్ సంభాషణ మొదలుపెట్టిన మోదీ.. ‘దుర్గా పూజకు నెలవైన బెంగాల్‌లో నువ్వో శక్తి స్వరూపిణివి. ఓ అరాచకవాదిని జైలుకు పంపావ్. ఎన్నికల్లో మీ మీద పెద్ద బాధ్యత ఉంచాం. మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మహిళల గౌరవం కోసం బసిర్‌హట్‌లోనే కాదు. యావత్ బెంగాల్‌లోనూ పోరాటం సాగిద్దాం’ అని సూచించారు.
సందేశ్‌ఖాలీలో మహిళలు గొంతెత్తగలగడం సామాన్య విషయం కాదని, తృణమూల్ పాలనతో విసిగిపోయిన బెంగాల్ నారీశక్తి ఈసారి తమకు అండగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిగా రేఖా పత్రా స్పందిస్తూ ‘‘మీరు మా పాలిట దేవుడిలా వచ్చారు. ఆ శ్రీరాముడే మాతో ఉన్నట్లుగా భావిస్తున్నాం. 2011 నుంచి ఇక్కడ ఎవరం ఓటు వేయలేదు. ఈ సారి హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పించండి’’ అని కోరారు.
సందేశ్‌ఖాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షాజహాన్ షేక్, అతడి అనుచరులు మహిళలపై లైంగిక వేధింపులు, భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై షాజహాన్ అనుచరులు దాడికి కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సందేశ్‌ఖాళీలో జరుగుతున్న దారుణాలను, వాటికి తృణమూల్ మద్దతు ఇస్తుండడాన్ని మోదీ ఇప్పటికే పలుసార్లు ప్రస్తావించారు.
పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటైన బసీర్‌హాట్‌కు ప్రస్తుతం టిఎంసి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈడీ అధికారులపై దాడికి సంబంధించి అరెస్టయిన షాజహాన్ షేక్, అతని అనుచరులు కొందరు ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్నారు. షేక్‌ను టిఎంసి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు