అమరావతి రైతుల ఉద్యమానికి విరామం

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ప్రవర్తనా నియామవళి అమలులోకి రావడంతో అమరావతి రైతులు తమ ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, పోలీసుల సూచన మేరకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు సమన్వయ కమిటీ, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
 
2019 డిసెంబరు 17న సిఎం జగన్‌ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన అనంతరం రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులు నిరసనలు ప్రారంభమయ్యాయి. విరామం లేకుండా 1560 రోజులుగా ఎన్ని అవాంతరాలు, అణచివేతలు ఎదురైనా అప్రతిహతంగా అమరావతి ఉద్యమం కొనసాగింది. 
 
సార్వత్రిక ఎన్నికల నిబంధనలు అమలులోకి రావడంతో ఉద్యమాన్ని సోమవారం నుంచి నిలుపుదల చేశారు. 2020 డిసెంబరు 25 నుంచి కరోనా లాక్‌డౌన్‌ ప్రారంభం అయిన తరువాత కూడా ఇళ్ల వద్దనే రైతులు తమ నిరసనను కొనసాగించారు. 2021 అక్టోబరు వరకు ఉద్యమం కొంత మందగించినా ఆ తరువాత `న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో నేలపాడు నుంచి తిరుపతి వరకు పాదయాత్ర నిర్వహించారు. 
 
రెండోసారి `అమరావతి నుంచి విశాఖ’ వరకు నిర్వహించిన పాదయాత్రకు అధికార పార్టీ శ్రేణులు అడ్డంకులు సృష్టించడంతో యాత్రను తూర్పు గోదావరి జిల్లా వరకు కొనసాగించారు. దాదాపు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల పాటు ఉద్యమం కొనసాగించడం ఒక చరిత్రగా రైతు కార్యాచరణ సమితి తెలిపింది. 
 
కరోనా లాక్‌డౌన్‌లు, తుపానులు, విలయాలు, పోలీసుల దౌర్జన్యాలు, దాష్టీకాలు, కేసులు, అరెస్టులు, వేధింపులు, లాఠీల దెబ్బలు, తూటాల వంటి మాటలు ఇలా ఎన్ని ఆటంకాలు వచ్చినా అవిశ్రాంతంగా కొనసాగించి సుదీర్ఘ సమరశీల పోరాటంగా నిలిచిందని తెలిపింది. వైసిపి ప్రభుత్వం ఎన్ని ఎత్తుగడలు వేసినా ఉద్యమం కొనసాగిందని, ఇప్పటి వరకూ 2600 మందిపై 600కు పైగా కేసులు బనాయించారని, ఈ నాలుగేళ్లలో 250 మంది రైతులు చనిపోయారని తెలిపింది.