ప్రతి ఓటర్ ను కనీసం మూడు సార్లు కలవాలి

ప్రతి ఓటర్ ను కనీసం మూడు సార్లు కలవాలి
ఎన్నికలలోపు ప్రతి ఓటర్ ను కనీసం మూడుసార్లు కలిసేవిధంగా కార్యాచరణ రూపొందించాలని తెలంగాణాలో బిజెపి ఎన్నికల ప్రచారంపై వ్యూహాన్ని రూపొందించుకుంది. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర బిజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ కన్వీనర్లు, ప్రభారీలు, మోర్చాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ శాసనసభ్యులతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థులు పాల్గొన్నారు.
 
బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె.లక్ష్మణ్ పాల్గొని దిశానిర్ధేశం చేశారు.  వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఏప్రిల్ 25న నామినేషన్లు ముగిసే వరకు పార్టీ పటిష్టత కోసం కార్యాచరణ రూపొందించారు.
 
దానిలో ముఖ్యంగా పోలింగ్ బూత్ స్థాయిలో మోదీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారిని కలవడం,  స్వయం సహాయక బృందాలు (మహిళా సంఘాలు)ను కలిసి వారి ద్వారా పార్టీని బలోపేతం చేయడం.  బిజేపీ ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 6న పోలింగ్ సెంటర్ వారీగా ‘టిఫిన్ సమావేశాలు’ నిర్వహించడం జరపాలని నిర్ణయించారు.
 
నమో యాప్ ద్వారా చిన్న మొత్తం నిధులు(మైక్రో డొనేషన్స్) పొందుదుకు కృషి చేయాలని,  ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించాలని,   ప్రతి పోలింగ్ లో 370 ఓట్లు (సుమారుగా పోలైన ఓట్లలో 50 శాతం) సాధించేందుకు కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
ప్రతి పోలింగ్ బూత్ లో బలాన్ని బట్టి ఎ– బి- సి- డి లుగా వర్గీకరించి బలోపేతానికి కృషి చేయాలని,  పార్లమెంట్ అభ్యర్థి నేరుగా పాల్గొనేలా సమావేశాలు నిర్వహించాలని,   పార్లమెంటు, అసెంబ్లీ స్తాయిల్లో ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ సమావేశాలు తరచుగా నిర్వహించి, ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయాలని దిశానిర్ధేశం చేశారు.
 
గ్రామ నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిల్లో కొత్త వారిని పార్టీలోకి ఆహ్వనించాలని,  వివిధ మోర్చాలు.. ముఖ్యంగా యువమోర్చా- మొదటిసారి ఓటేస్తున్న యువతను ఆకర్శించే విధంగా, కిసాన్ మోర్చా- రైతులలో, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మోర్చాలు- ఆయా వర్గాలతో నిరంతర సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చేవిధంగా కృషి చేయాలని తలపెట్టారు.
 
నామినేషన్ల వరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించారు.  బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతకోసం ప్రతి నాయకుడు తమ తమ పోలింగ్ బూత్ లలో కోఆర్డినేటర్లుగా పనిచేయాలని కూడా నిర్ణయించారు. నామినేషన్లలోపు బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు.
 
తెలంగాణలో తాజాగా మరో ఇద్దరు బిజెపి అభ్యర్థులను ప్రకటించడంతో మొత్తం 17 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది.