సుప్రీంలో కవితకు ఎదురుదెబ్బ

సుప్రీంలో కవితకు ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. తన అరెస్ట్ చట్టవిరుద్దమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ నిర్వహించింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు సుప్రీం ధర్మాసనం జత చేసింది. 

రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను మాత్రమే విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. బెయిల్ తాము ఇవ్వలేమని, ఎవరైనా కింది కోర్టును మొదట ఆశ్రయించాల్సిందేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. 

బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. పిటిషనర్ ఎవరైనా సరే తాము ఏకరీతి విధానాన్ని అనుసరిస్తామని వ్యాఖ్యానించింది. బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తాము అంగీకరించబోమని తెలిపింది. బెయిల్ తాము ఇవ్వలేమని, ఎవరైనా కింది కోర్టును మొదట ఆశ్రయించాల్సిందేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కవిత కేసు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. కవిత తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

కాగా ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం ఈడీ అరెస్టు చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ పై అత్యవసర విచారణకి సుప్రీంకోర్టు అంగీకరించింది.