
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. రోదసి ప్రయాణాలు అత్యంత సులభతరం చేసేందుకు చేపట్టిన అత్యంత కీలకమైన ప్రయోగం విజయవంతమైంది. దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ లాంచ్ వెహికల్ ‘పుష్పక్ విమాన్’ను ఇస్రో శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది.
రెక్కలతో తయారు చేసిన ‘స్వదేశీ స్పేస్ షటిల్’గా పిలిచే పుష్పక్ తో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించే ప్రక్రియలో భారత్ మరో మైలురాయిని దాటింది. పునర్వినియోగ రాకెట్ ‘పుష్పక్ విమాన్’ను కర్ణాటకలోని రక్షణశాఖకు చెందిన ‘చాలకెరె రన్‌వే’ నుంచి ఉదయం 7 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
ఇందులో భాగంగా పుష్పక్ తనంతట తానుగా రన్‌వేపై ల్యాండైంది. అత్యంత సంక్లిష్టమైన ‘రొబోటిక్ ల్యాండింగ్’ సామర్థ్యాన్ని సాధించేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది. అంతరిక్ష రంగంలో సుస్థిరత, వ్యర్థాల తగ్గింపు దిశగా ఇస్రో గత దశాబ్దకాలంగా పుష్పక్‌ను అభివృద్ధి చేస్తోంది.
పరీక్షలో భాగంగా వైమానిక దళం హెలికాఫ్టర్ నుండి రాకెట్‌ను జారవిడిచిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ సోమనాథ్ తెలిపారు. 21వ శతాబ్దపు పుష్పక్ ప్రయోగ ఫలితాలు ‘అద్భుతమైనవి, ఖచ్చితమైనవి ‘ అని ఆయన అని పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో దేశ సాంకేతిక సామర్థ్యాలు విస్తృతమవడంతో పాటు అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించవచ్చని తెలిపారు.
భారత వైమానిక దళం చినూక్ హెలికాప్టర్‌లో ఆర్‌ఎల్‌విని 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టింది. రన్‌వే నుండి 4 కి.మీ దూరంల విడుదలైన తర్వాత, పుష్పక్ స్వయంగా క్రాస్ రేంజ్ కరెక్షన్‌లతో పాటు రన్‌వేపై ల్యాండ్ అయింది. బ్రేక్ పారాచూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్స్, నోస్ వీల్ స్టీరింగ్ సిస్టమ్ సాయంతో స్వయంగా ఆగినట్లు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. 6.5 మీటర్ల పొడవు, 1.75 టన్నుల బరువుండే ‘పుష్పక్’ను ఆకాశంలో ఓ ఐఏఎఫ్ హెలికాప్టర్ నుంచి భూమిపై నిర్దేశిత లక్ష్యం వైపు ప్రయోగిస్తారు.
పుష్పక్‌ను విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకు ఇది మూడోసారి. గతేడాది జరిపిన పరీక్షలో ఎయిర్‌ఫోర్సు హెలికాఫ్టర్ నుంచి వదిలిన పుష్ఫక్..మానవుల నియంత్రణ లేకుండా తనంతట తానుగా ల్యాండయింది. దీంతో, ఆర్బిటల్ రీఎంట్రీ సామర్థ్యం సముపార్జనలో ఒకడుగు ముందుకు వేసింది. ఇస్రో నిర్మించబోయే అంతరిక్ష స్పేస్ స్టేషన్‌కు విడిభాగాలు, వ్యోమగాముల తరలింపులో ఈ రాకెట్ కీలకం కానుంది.
రూ. 100 కోట్లతో ఇస్రో ‘పుష్పక్ విమాన్’ ప్రాజెక్టు చేపట్టింది. 2012లో ఈ రాకెట్ డిజైన్‌కు ఆమోదం లభించడంతో ఇస్రో ఆర్ఎల్‌వీ-టీడీ పేరిట ఓ ప్రయోగాత్మక పునర్వినియోగ రాకెట్ మోడల్‌ను రూపొందించింది. ఈ రాకెట్ సామర్థ్యాలను 2016లో తొలిసారిగా పరీక్షించారు. పునర్వినియోగ సామర్థ్యం ఉన్న రాకెట్‌తో అంతరిక్ష ప్రయోగాల్లో వ్యర్థాల విడుదల తగ్గుతుందని ఇస్రో చెబుతోంది.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!