
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మెదడు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ నెల 17న మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడంతో వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రిలో చేరారు. అదే రోజు వైద్యుల బృందం ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించింది.
సద్గురు ఆరోగ్యంపై జర్నలిస్ట్ ఆనంద్ నరసింహన్ సోషల్ మీడియాలో అప్‌డేట్ ఇచ్చారు. సద్గురు గత కొద్దిరోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సమాచారం మేరకు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు డాక్టర్ వినీత్ సూరీ ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. ఆయన సూచనతో ఎంఆర్‌ఐ చేయించుకున్నారు.
పరీక్షల్లో మెదడులో భారీగా రక్తస్రావం జరిగినట్లుగా గుర్తించారు. 17న ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో పాటు పలుసార్లు వాంతులు చేసుకున్నారు. తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత సీటీ స్కాన్ చేయగా రక్తస్రావంతో పాటు మెదడులో తీవ్రమైన వాపు సైతం ఉన్నట్లు తేలింది. దీంతో ఢిల్లీ అపోలోకు చెందిన డాక్టర్లు వినిత్ సూరీ, ప్రణవ్ కుమార్, సుధీర్ త్యాగి, ఎస్ ఛటర్జీ నేతృత్వంలోని బృందం ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స చేసింది. ఆపరేషన్ విజయవంతమైందని.. ఆయనకు బాగా కోలుకుంటున్నారని నరసింహన్ సోషల్ మీడియా పోస్టులో వివరించారు.
మరో వైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆసుపత్రిలో జగ్గీ వాసుదేవ్ కోలుకుంటున్నారని తెలిపింది. 17న సద్గురువుకు మెదడుకు శస్త్ర చికిత్స జరిగిందని.. మెదడులో తీవ్ర రక్తస్రావంతో శస్త్ర చికిత్స తప్పనిసరైందని వైద్యులు చెప్పారు. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయ్యిందని.. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు