
ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ తొమ్మిది నెలల క్రితం కెనడాలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య ఘటన భారత్ – కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలకు దారి తీసింది. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ స్వయానా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ నమ్మించారు.
ఈ నిఘా సమాచారాన్ని ‘ఫైవ్ ఐస్’ భాగస్వామ్య దేశాలతో పంచుకున్నట్లు తెలిపింది. అయితే ట్రూడో ఆరోపణలను ఫైవ్ ఐస్ భాగస్వామ్య దేశం న్యూజిలాండ్ తాజాగా కొట్టిపారేసింది. ‘ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్’లో భాగమైనప్పటికీ ట్రూడో ప్రభుత్వం ఎటువంటి సాక్ష్యాలను పంచుకోలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కెనడా ఆరోపణలపై అనుమానం వ్యక్తం చేసింది.
ఈ కేసులో నిఘా సమాచార మార్పిడి కోసం ‘ఫైవ్ ఐస్’ కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ కూటమిలో న్యూజిలాండ్, కెనడాతోపాటు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ఉప ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజ్జర్ హత్య కేసు గురించి మాట్లాడారు.
నిజ్జర్ కేసును గత ప్రభుత్వం చూసుకుందని చెబుతూ ఫైవ్ ఐస్‌లో భాగంగా సమాచార మార్పిడి జరిగినప్పటికీ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలకు సంబధించి కచ్చితమైన సాక్ష్యాలు మాత్రం ఒక్కటి కూడా కనిపించలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ అని కెనడాను ఆయన ప్రశ్నించారు. కెనడా ఆరోపణలపై ఫైవ్ ఐస్ భాగస్వామ్య దేశం ప్రశ్నించడం ఇదే తొలిసారి. దీంతో ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు