
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణా కాంగ్రెస్ లో టికెట్ల కోసం ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉండటం, పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనే అంచనాల కారణంగా టికెట్ల కోసం పోటీ బాగా పెరిగిపోతోంది. ఒక వంక `కుటుంభ రాజకీయాలకు’ నెలవుగా కాంగ్రెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఎండగడుతూ, ఈ అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం తమ కుటుంభ సభ్యులకు సీట్లకోసం పట్టుబడుతున్నారు. చాలామంది సీనియర్లకు ఢిల్లీలోని కీలకనేతలతో ఉన్న సంబంధాల కారణంగా ఎవరికివారుగా తమ కుటుంబసభ్యలకు టికెట్లు ఇప్పించుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నారు. ఇలాంటి లాబీయింగ్ లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మరికొందరు చాలా బిజీగా ఉన్నారు. అలాగే ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, గడ్డం వివేక్ లాంటి వాళ్ళు కూడా రేసులో దూసుకుపోతున్నారు.
ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ లాంటి నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ అంతకంతుకు పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మూడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై జనాల్లో సానుకూలత ఉండటం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో నాలుగింటిని అమల్లోకి తెచ్చింది.
ఇలాంటి పరిస్ధితుల్లో మొదటి వంద రోజుల్లోనే నాలుగు హామీలను అమల్లోకి తెచ్చామంటూ జనంలో సానుకూలత ఏర్పడినట్లు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవంక, మొన్నటి వరకు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ చతికలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కష్టపడితే గెలిచిపోతామన్న నమ్మకం ఉండబట్టే టికెట్ల కోసం డిమాండ్ బాగా పెరిగిపోతోంది.
ఏఐసీసీ ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు అభ్యర్థుల జాబితాలలో సహితం వారసులకు అవకాశం కల్పించడం గమనార్హం. కమల్ నాథ్, అశోక్ ఘేలాట్ వంటి అగ్రనేతల కుమారులకు సీట్లు ఇచ్చారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత