ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆమె తన రాజీనామా లేఖను పంపించారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం పని చేస్తానని ఆమె ప్రకటించారు. ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తిని కూడా వ్యక్తం చేశారు.
మహిళల సాధికారత కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని తీసుకుంటోందని,ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. జగన్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదనే భావం కొందరిలో ఉండొచ్చని, ఆయన కుటుంబ సభ్యుల్లోనే కొందరికి ఆ అభిప్రాయం ఉండొచ్చని అంటూ పరోక్షంగా వైఎస్ షర్మిల విమర్శలను ఆమె ప్రస్తావించారు.
కానీ అది నిజం కాదని, ఈ పార్టీ మహిళల సాధికారత కోసమే పని చేస్తూనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా బరిలోకి దిగమని చెప్తే సిద్ధమన్నారు. తన స్వస్థలం జగ్గయ్య పేట కాబట్టి అక్కడి నుంచే పోటీ చేస్తాననే అభిప్రాయం ఉండడం సహజం అని పేర్కొన్నారు.
కానీ పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని, తాను పార్టీ కోసం అన్నింటికీ సిద్ధం అంటూనే ఎన్నికల్లో పోటీ చేయడానికి తన రాజీనామాకు సంబంధం లేదని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆమెకు 2019 ఎన్నికలలో పోటీ చేయాలని భావించినప్పటికీ రాజకీయ సమీకరణాల కారణంగా టికెట్ లభించలేదు.
దీంతో ఆమెకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి దక్కింది. ఇప్పటి వరకు జగన్‌కు అండగా ఉండి విమర్శలను తిప్పికొట్టగలిగే నేతగా పేరున్న ఆమె ఇప్పుడు రాజీనామా చేయడం వెనక కారణం ఈసారి కూడా టికెట్ దక్కకపోవడమేనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈసారి ఎన్నికల్లో మైలవరం, లేదంటే జగ్గయ్యపేటలో ఏదో ఒకదాని నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలని పద్మ భావించినట్టు చెబుతున్నారు.

More Stories
పరకామణిలో చోరీ కేసుబలహీనపర్చారు
‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించండి
పోలవరం ప్రాజెక్టులో 87 శాతం సివిల్ పనులుపూర్తి