చండీగఢ్‌ లో డిప్యూటీ మేయర్లు ఇద్దరూ బిజెపి వారే!

చండీగఢ్‌ లో డిప్యూటీ మేయర్లు ఇద్దరూ బిజెపి వారే!

చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో సీనియర్‌ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులు రెండూ బీజేపీకే దక్కాయి. బీజేపీ కౌన్సిలర్‌లు కుల్జీత్‌ సింగ్‌ సంధూ, రాజిందర్‌ శర్మ ఆ పదవులకు ఎంపికయ్యారు. కుల్జీత్‌ సింగ్‌ సంధూను సీనియర్‌ డిప్యూటీ మేయర్‌గా, రాజిందర్‌ శర్మను డిప్యూటీ మేయర్‌గా కౌన్సిలర్‌లు ఎన్నుకున్నారు.

సీనియర్‌ డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లోని మొత్తం 35 మంది కౌన్సిలర్లలో 19 మంది బీజేపీ అభ్యర్థి కుల్జీత్‌సింగ్‌ సంధూకు, 16 మంది కాంగ్రెస్‌-ఆప్ కూటమి అభ్యర్థి గుర్‌ప్రీత్‌ గాబీకి ఓటేశారు. మరో ఓటు చెల్లుబాటు కాలేదు. డిప్యూటీ మేయర్‌ పదవికి జరిగిన ఎన్నిక సందర్భంగా కూడా 19 మంది బీజేపీ అభ్యర్థి రాజిందర్‌ శర్మకు ఓటేయగా, మరో 17 మంది కాంగ్రెస్‌-ఆప్‌ కూటమి అభ్యర్థికి ఓటేశారు.

దాంతో కుల్జీత్‌సింగ్‌ సంధూ చండీగఢ్‌ సీనియర్‌ డిప్యూటీ మేయర్‌గా, రాజిందర్‌ శర్మ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కాగా, చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లోని 35 మంది కౌన్సిలర్‌లలో బీజేపీ కౌన్సిలర్‌లు 17 మంది, ఆప్‌ కౌన్సిలర్‌లు 10 మంది, కాంగ్రెస్‌ కౌన్సిలర్‌లు 7 మంది ఉన్నారు. బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌ పార్టీ నుంచి ఒక కౌన్సిలర్‌ కార్పోరేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సోమవారం జరిగిన ఓటింగ్‌లో బీజేపీ అభ్యర్థులకు బీజేపీకి చెందిన 17 మంది కౌన్సిలర్‌లు, ఎస్‌ఏడీ కౌన్సిలర్‌, ఎక్స్‌ అఫిషియో మెంబర్‌ హోదాలో స్థానిక ఎంపీ కిరణ్‌ ఖేర్‌ ఓటేశారు. దాంతో వారికి 19 చొప్పున ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌, ఆప్‌కు చెందిన 17 మంది కౌన్సిలర్‌లలో సీనియర్‌ డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా ఒక ఓటు చెల్లుబాటు కాలేదు. దాంతో కూటమి అభ్యర్థికి 16 ఓట్లే వచ్చాయి. డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో కూటమి అభ్యర్థికి 17 ఓట్లు పడ్డాయి.