కరోనా లాక్‌డౌన్ తర్వాత గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న తరుణంలో కరోనా వ్యాక్సిన్ వల్లే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే వాదనల్లో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్నిర్వహించిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ గుండెపోటుకు కరోనా వ్యాక్సిన్‌లు కారణం కాదని స్పష్టం చేశారు.
శనివారం ఏఎన్ఐ డైలాగ్స్ 2024లో మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ ఈరోజుల్లో ఎవరికైనా గుండెపోటు వచ్చిందంటే దానికి కరోనా వ్యాక్సిన్ కారణమని భావిస్తున్నారని, అయితే గుండెపోటుకు వ్యాక్సిన్ బాధ్యత వహించదని ఐసిఎంఆర్ ఒక వివరణాత్మక అధ్యయనం చేసిందని చెప్పారు. గుండెపోటుకి ఆ వ్యక్తుల జీవన శైలి, పొగాకు, మద్యపానం వంటి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు.
కొన్నిసార్లు తప్పుడు సమాచారం ప్రజల్లో వ్యాపిస్తుందని, అప్పుడు వాస్తవాలు వెలుగులోకి రావడానికి కొంత సమయం పడుతుందని వివరించారు. ఏదేమైనా గుండెపోటుకి కరోనా వ్యాక్సిన్ కారణం కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
ఇదిలావుండగా కరోనా వ్యాక్సిన్ కారణంగా యువకుల్లో ఆకస్మిక మరణాల ప్రమాదం పెరుగుతోందని ఆందోళనలు వ్యక్తమైన తరుణంలో ఐసిఎంఆర్ ఒక అధ్యయనం నిర్వహించింది. వ్యక్తుల జీవనశైలి, కొన్ని అలవాట్లు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు గుండెపోటుకు అంతర్లీన కారణాలు కావొచ్చని ఆ అధ్యయనం తెలిపింది.
రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ ఆకస్మిక మరణాల సంఖ్యను తగ్గించిందని కూడా తేల్చింది. అయితే కరోనా గుండె జబ్బులు, స్ట్రోక్‌ను ప్రమాదాన్ని పెంచుతుందని ఈ అధ్యయనం అంగీకరించింది. గుండెపోటుకు వ్యాక్సిన్ కారణం కాదని తేల్చిన ఈ అధ్యయనం ధూమపానం, అతిగా మద్యపానం సేవించడం, మాదకద్రవ్యాల వినియోగం, తీవ్రమైన శారీరక శ్రమ వంటి జీవనశైలి వల్ల గుండెపోటు సంభవిస్తుందని వెల్లడించింది.
More Stories
జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చే సంస్థతో సోనియా!
సరిహద్దు భద్రతకు డ్రోన్ వ్యతిరేక విభాగం
ప్రతిపక్షాలు ప్రజాతీర్పును స్వాగతించాలి