ప్లేస్కూల్‌లో బీజేపీ మహిళా కార్యకర్త మృతదేహం

ప్లేస్కూల్‌లో బీజేపీ మహిళా కార్యకర్త మృతదేహం
ఐదు రోజుల కిందట అదృశ్యమైన బీజేపీ మహిళా కార్యకర్త మృతదేహం ఒక ప్లేస్కూల్‌లో లభించింది. వ్యాపార భాగస్వామి అయిన వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం అతడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 
 
32 ఏళ్ల వర్షా, బీజేపీ మహిళా కార్యకర్త. సోహన్ లాల్ అనే వ్యక్తితో కలిసి నరేలాలోని స్వతంత్ర నగర్‌లో ప్లేస్కూల్‌ ఏర్పాటు చేస్తున్నది. ఫిబ్రవరి 23న అతడితో కలిసి కనిపించిన ఆమె ఆ తర్వాత అదృశ్యమైంది. కాగా, ఫిబ్రవరి 24న తండ్రి విజయ్‌ కుమార్‌ వర్షా మొబైల్‌కు ఫోన్‌ చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌లో మాట్లాడాడు. 
 
హర్యానాలోని సోనిపట్‌లో రైలు పట్టాలు వద్ద ఉన్న అతడు ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పాడు. అనంతరం వీడియో కాల్‌లో మాట్లాడిన ఆ వ్యక్తిని సోహన్‌ లాల్‌గా వర్షా తండ్రి గుర్తించాడు. ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా సోహన్‌ కనిపించలేదు.మరోవైపు పోలీసులు ఆ ప్లే స్కూల్‌లో వెతికారు. అయితే గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఆఫీస్‌ షట్టర్‌కు లాక్‌ వేసి ఉండటంతో లోపల వెతకలేదు. సోహన్ మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేయగా హర్యానాలోని బరౌటాలో చివరగా ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అయితే సోహన్, వర్షా ఆచూకీ లభించలేదు.

కాగా, ఫిబ్రవరి 28న వర్షా తండ్రి విజయ్‌ కుమార్‌ మరోసారి ప్లే స్కూల్‌కు వెళ్లాడు. షట్టర్‌ ఓపెన్‌ చేయాలని ఆ ఇంటి యజమానిని కోరాడు. ప్లే స్కూల్‌ ఆఫీస్‌ లోపల కుమార్తె వర్షా మృతదేహాన్ని తండ్రి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

ప్లే స్కూల్‌ వ్యాపార భాగస్వామి సోహన్ లాల్‌ చున్నీతో వర్షా గొంతునొక్కి ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. ఫిబ్రవరి 25న హర్యానాలోని సోనిపట్‌లో రైలు పట్టాల వద్ద లభించిన గుర్తె తెలియని వ్యక్తి మృతదేహం సోహన్ లాల్‌దిగా భావించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.