తెలంగాణ వీహెచ్‌పీ నూతన అధ్యక్షునిగా నరసింహమూర్తి

తెలంగాణ వీహెచ్‌పీ నూతన అధ్యక్షునిగా నరసింహమూర్తి

విశ్వహిందూ పరిషత్ తెలంగాణా రాష్ట్ర నూతన అధ్యక్షులుగా భోజనపల్లి నరసింహమూర్తి, భాగ్యనగర్ క్షేత్ర సంఘటనా మంత్రిగా గుమ్మళ్ల సత్యంలను నియమించారు. అయోధ్యలో గత మూడు రోజులు పాటు జరిగిన విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సమావేశాలలో మంగళవారం జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్ర కమిటీలలో మార్పులు చేస్తూ కొత్త నియామకాలను జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్  ప్రకటించారు. 

నరసింహ మూర్తి చిన్ననాటి నుండి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశారు, వివిధ స్థాయిలలో బాధ్యతలు నిర్వహించారు. నరసింహమూర్తి గతంలో దశాబ్దం పాటు (1984 నుంచి 1994 వరకు) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ గా పనిచేశారు. 

గుంటూరు నగర, విజయనగరం జిల్లా ప్రచారక్ గా సేవలందించారు. ఆ తర్వాత భారతీయ మజ్దూర్ సంఘ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా పనిచేశారు. భాగ్యనగర్ కేంద్రంగా దిల్ సుఖ్ నగర్ జిల్లా ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ గా పదేళ్లు, భాగ్యనగర్ సంబాగ్ ( గ్రేటర్ హైదరాబాద్) కార్యకారిణి సభ్యులుగా నాలుగేళ్లపాటు సంఘ కార్యంలో ఉన్నారు.

బీఎస్సీ, బిఎల్ పూర్తిచేసిన నరసింహమూర్తి గత ఆరు నెలలుగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ, ప్రస్తుతం అయోధ్యలో జరుగుతున్న సమావేశాలలో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. గుమ్మళ్ళ సత్యం వీహెచ్‌పీలో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించారు. వీరిద్దరి నియామకం పట్ల తెలంగాణా రాష్ట్ర శాఖ హర్షాన్ని ప్రకటిస్తుంది.