పాక్ కు రావి నది నీరు పూర్తిగా నిలిపివేసిన భారత్

ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు తాజాగా భారత్ మరో కోలుకోలేని దెబ్బ కొట్టింది. రావి నదిపై షాపూర్ కంది బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి.. పాక్‌కు ఆ నది నీటి ప్రవాహాన్ని నిలిపివేసింది. ఇప్పుడు ఆ నీరుని జమ్ముకశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాల్లో సాగునీరుగా మళ్లించనున్నారు. దాదాపు 1150 క్యూసెక్కుల నీరుని ఈ ప్రాంతాలకు అందనుంది. 

దీంతో ఆ ప్రాంతాల్లో వ్యవసాయ అవకాశాలు మరింత పెరగనున్నాయి. మొత్తం 32,000 హెక్టార్ల భూమికి ప్రయోజనం చేకూరనుంది. ఈ బ్యారేజీని పంజాబ్‌ రాష్ట్రం పఠాన్‌కోట్ జిల్లాలో రావి నదిపై నిర్మించారు గతంలో 1960 సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి నది నీటిలోని కొంత భాగం లఖన్‌పూర్ ఆనకట్ట ద్వారా పాకిస్తాన్‌లోకి ప్రవహించేది. 

అయితే షాపూర్ కంది బ్యారేజీ ఈ ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేస్తుంది. ఆ నీటిని ఇప్పుడు భారత్ సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఈ చర్యతో , సట్లెజ్, బియాస్ నదులపై భారత్ ప్రత్యేక నియంత్రణను పొందుతుంది. భారత్ నుంచి పాకిస్తాన్‌లోకి ప్రవహించే 1150 క్యూసెక్కుల రావి నది నీటిని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌కు తరలించాలని భావిస్తున్నట్లు సమాచారం. 

ఇందులో భాగంగానే పాక్‌కు వెళ్లే రావి నది నీటిని మళ్లించి కథువా, సాంబా జిల్లాల్లోని 32 వేల హెక్టార్ల భూమికి సాగు నీరుగా అందించనున్నారు. అయితే రావి సింధు, జీలం, చీనాబ్ నదుల నిర్వహణ మాత్రం పాకిస్తాన్ చేతుల్లో ఉంటుంది. 

ఏది ఏమైనా రావి నది నీరుని పాక్‌కు ప్రవహించకుండా నిలిపివేయడం, భారతదేశంలో నీటి నిర్వహణలో వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది. దీని వల్ల జమ్ముకశ్మీర్‌లోని ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. నిజానికి  ఈ షాపూర్ కంది బ్యారేజ్ ప్రాజెక్ట్ 1950ల్లోనే ప్రారంభించబడింది. కానీ దీని నిర్మాణం 1992 వరకు ప్రారంభం కాలేదు. 

ఆ తర్వాత కూడా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. చివరికి 1995లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పునాది రాయి వేశారు. అయితే, జమ్ముకశ్మీర్, పంజాబ్ ప్రభుత్వాల మధ్య విభేదాల కారణంగా ఇది ఆలస్యమైంది. ప్లాన్ ప్రకారం  ఈ ప్రాజెక్ట్ 2002లో పూర్తి కావాల్సింది. కానీ.. నిధులు, భూసేకరణ, పర్యావరణ సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల ఇది ఆలస్యమవుతూ వచ్చింది. 

చివరకు 2018 డిసెంబర్‌లో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో  2022లో పూర్తయ్యింది. రూ. 3300 కోట్ల విలువైన ఈ షాపూర్ కంది ప్రాజెక్టు ద్వారా సాగు నీటితో పాటు 206 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా ఆ ప్రాంతం పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్థానిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.