జాహ్నవి కందుల మృతి కేసుపై సమీక్ష కోరిన భారత్

అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్‌పై సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడంపై భారత్‌ స్పందించింది.  ఆమె మృతికి కారణమైన సియాటెల్ పోలీసు అధికారి కెవిన్ డవేపై నేరారోపణల్ని ఎత్తివేస్తూ అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పుపై తాజాగా భారత్ స్పందించింది. 
 
ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని సియాటెల్ భారత రాయబార కార్యాలయం కోరింది. జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని, తగిన పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. అమెరికా కోర్టు తీర్పుపై భారత రాయబార కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది.

‘‘జాహ్నవి కందుల మృతిపై ఇటీవల కింగ్ కౌంటీ ప్రాసిక్యూషన్ అటార్నీ విడుదల చేసిన ‘దర్యాప్తు నివేదిక’పై.. మేము సంబంధిత అధికారులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నాం. జాహ్నవి, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా.. కాన్సులేట్ అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తూనే ఉంటుంది. తగిన పరిష్కారం కోసం సియాటెల్ పోలీసులతో పాటు స్థానిక అధికారుల వద్ద కూడా ఈ విషయాన్ని గట్టిగా లేవనెత్తడం జరిగింది. ఇప్పుడు సమీక్ష కోసం ఈ కేసుని సియాటెల్ సిటీ అటార్నీ కార్యాలయానికి పంపబడింది. సియాటెల్ పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు మేము వేచి ఉన్నాం. ఈ కేసు పురోగతిని పర్యవేక్షిస్తూనే ఉంటాం’’ అని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన జాహ్నవి(23) నార్త్‌ఈస్ట్రన్‌ విశ్వవిద్యాలయంలో మాస్టర్‌ డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్లారు. గత ఏడాది జనవరి 23న ఆమె రోడ్డు దాటుతున్నప్పుడు 119 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం ఢీ కొనడంతో ఆమె 100 అడుగుల దూరం ఎగిరి పడ్డారు. 

అదే రోజు రాత్రి ఆమె మృతి చెందారు. పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్ నిర్లక్ష్యం, కారు ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాఫ్తులో తేలింది. ఇక ఈ కేసు దర్యాప్తుపై పోలీస్‌ అధికారి అడెరెర్‌ మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌ అయింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఆమె చావుకు విలువ లేదు’ అన్నట్టు చులకనగా ఆయన మాట్లాడారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. అయితే, ఈ ప్రమాదంలో కెవిన్ డేవ్ కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని, అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోలేమని అక్కడి కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుపై జాహ్నవి కుటుంబ సభ్యులు, సీటెల్ లోని జాహ్నవి స్నేహితులతో పాటు భారత రాయబార కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఈ తీర్పుపై రివ్యూ కోరింది.