
* హెలికాప్టర్ ల్యాండ్ అనుమతి నిరాకరణతో భీమవరం పర్యటన వాయిదా!
ఒకవంక ఎన్నికలు దగ్గర పడుతున్నా రాజకీయ పొత్తులు అస్పష్టంగా ఉండడంతో, ఏపీలో పట్టు పెంచుకుని, విజయమే లక్ష్యంగా తహతహలాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చివరి దశలో ఉంది. చంద్రబాబు నాయుడు, లోకేశ్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.
మరోవంక, ఈ కూటమిలోకి బిజెపిని కూడా తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు అటు జరుగుతూ ఉండగానే పవన్ కూడా ప్రచార రంగంలో దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పవన్ కోసం ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధం అయ్యింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టడంలో భాగంగా బుధవారం భీమవరం నుండి ఆరంభించేందుకు ప్రభుత్వం మోకాలడ్డింది.
హెలీకాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారు. ఈ కారణంతో బుధవారం చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడిందని జనసేన ప్రకటించింది. విష్ణు కాలేజీ ప్రాంగణంలోని హెలీప్యాడ్ లో పవన్ కల్యాణ్ ప్రయాణించే హెలీకాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారని జనసేన తెలిపింది.
దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరం చెప్పడం వెనక అధికార పక్షం ఒత్తిళ్లు ఉన్నట్లు అర్థమవుతోందని జనసేన నేతలు ఆరోపించారు. విష్ణు కాలేజీలో ఉన్న హెలీప్యాడ్ ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారని పేర్కొన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చెప్పడం విచిత్రంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ అండ్ బీ అధికారులతో అనుమతుల విషయంలో ఇలానే అభ్యంతరాలు చెబుతున్నారని తెలిపారు. వైసిపి అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకుంటుందని జనసేన విమర్శించింది. అన్ని నియోజకవర్గాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశాలను ఇప్పటికే పార్టీ వర్గాలు గుర్తించాయి. హెలిపాడ్ నిర్మాణాల అనుమతుల కోసం జనసేన తరపున సంబంధిత అధికారులకు లేఖలు వెళ్లాయి.
ప్రతి జిల్లాకు మూడు సార్లు వెళ్లాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. మొదటి పర్యటనలో జిల్లా ముఖ్యనేతలతో సమీక్షలు, రెండు, మూడు పర్యటనల్లో జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సభల్లో పాల్గొనేలా పవన్ షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. బుధవారం నుంచి నాలుగు రోజులు పాటు గోదావరి జిల్లాల్లో ముఖ్యనేతలతో సమీక్షల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.
బుధవారం భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో, గురువారం అమలాపురంలో జిల్లా ముఖ్యనేతలతో, 16వ తేదీన కాకినాడలో, 17న రాజమండ్రిలో పవన్ సమీక్షలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతిరోజూ ఆయన పట్టణాలు హెలికాప్టర్‌లో వెళ్లి, రాత్రి తిరిగి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకునేలా షెడ్యూల్ సిద్ధం చేశారు.
ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో టికెట్ల విషయంపై పార్టీ ముఖ్యనేతలతో, టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు ఉండనున్నాయి. దీనికి వీలుగా జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పటికీ రాత్రి వేళల్లో అందుబాటులో ఉండేలా పార్టీ నేతలు పవన్ పర్యటనలను ఏర్పాటు చేసుకున్నారు.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ