ఐదవసారి రాజ్యసభకు జయా బచ్చన్

ఐదవసారి రాజ్యసభకు జయా బచ్చన్

ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరగనున్న ఎన్నికలలో జయా బచ్చన్‌ను మరోసారి నామినేట్ చేసిన సమాజ్‌వాది పార్టీ(ఎస్‌పి), మాజీ ఎంపి రమీలాల్ సుమన్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అలోక్ రంజన్‌లను కూడా అభ్యర్థులుగా ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ సముదాయంలో ఈ ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. 

రాజ్యసభ సభ్యురాలిగా నాలుగవ పర్యాయం కొనసాగుతున్న జయా బచ్చన్‌ను ఐదవ పర్యాయం కోసం ఎస్‌పి నామినేట్ చేసింది. ఫిరోజాబాద్‌కు చెందిన సుమన్ నాలుగవసారి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతూ ఐదవ పర్యాయం కోసం పోటీ చేస్తున్నారు. మాజీ ఐఎఎస్ అధికారి అయిన రంజన్ గతంలో ఎస్‌పి ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 

ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. 403 మంది సభ్యుల ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో బిజెపి బలం 252 కాగా ఎస్‌పికి 108 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎస్‌పి ప్రతిపక్ష పార్టీలు ఉండగా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు ఇండియా కూటమిలో ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. రాజ్యసభకు ఏడుగురు అభ్యర్థులను బిజెపి ప్రకటించింది.

పార్లమెంట్ కు వచ్చిన ఇతర సినీ నటుల మాదిరిగా మౌనంగా ఉండకుండా సభా కార్యక్రమాలలో ఆమె చురుకుగా పాల్గొంటూ ఉంటారు. కీలక అంశాలను ప్రస్తావిస్తుంటారు. ఆవేశపూరిత ప్రసంగాలకు సహితం ఆమె పేరొందారు.