తిరుపతిలో బిగుస్తున్న నకిలీ ఓట్ల ఉచ్చు

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న నకిలీ ఓట్ల వ్యవహారంలో ఈరోజు  ఎన్నికల సంఘం పోలీసు అధికారులపై  కొరడా ఝళిపించింది. 2021లో జరిగిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలలో అధికారిక వెబ్ సైట్ నుంచి దాదాపు 35 వేల ఓటర్ ఐడీ కార్డులను డౌన్ లోడ్ చేసి వాటి ద్వారా నకిలీ ఐడీ కార్డులు ముద్రించి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించారని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి పిర్యాదులు చేశాయి. 
 
ఆ ఫిర్యాదులపై తాజా స్పందించిన ఎన్నికల సంఘం విచారణ జరిపించింది. అందులో గోప్యంగా ఉంచాల్సిన అధికారిక వెబ్ సైట్ లాగ్ ఇన్ కీ ను బయటి వ్యక్తులకు ఇవ్వడం ద్వారా నకిలీ ఓట్ల చలామణి జరిగిందని తేలింది.  ఫలితంగా గత నెలలో అప్పుడు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేసి, ప్రస్తుతం  అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్న గిరీశపై ఇప్పటికే ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. 
 
తాజాగా,  అనధికారికంగా ఏ ఆర్ ఓ గా వ్యవహరించిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళి రెడ్డిని కూడా సస్పెండ్ చేసింది. ఓటరు ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహారంలో చంద్రమౌళీశ్వర రెడ్డిని బాధ్యుడిగా ఈసీ గుర్తించింది. ఆ చర్యలకు కొనసాగింపుగా  ఆ సమయంలో తిరుపతిలో అప్పుడు పనిచేసిన పోలీసు అధికారులపై చర్యలకు ఎన్నికల సంఘం  నిర్దేశించింది.ఎన్నికల సంఘం నిర్ధేశించిన మేరకు అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డి ఆదివారం తూర్పు, పశ్చిమ  పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్లు  శివప్రసాద్‌రెడ్డి, శివప్రసాద్‌లను,  తూర్పు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్  ఎస్సై జయస్వాములు, హెడ్‌కానిస్టేబుల్‌ ద్వారకానాథ్‌రెడ్డిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.  అదే విధంగా అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ను వీఆర్‌కు పంపింది.

ఉప ఎన్నిక సందర్భంగా  దొంగ ఓట్లకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై నమోదైన 13 కేసులలో   సరైన ఆధారాలు లేవనే కారణంగా సంబంధిత  కేసును నీరుగార్చారన్నదే ఈ పోలీసు సిబ్బందిపై చర్యలకు కారణమని తెలుస్తోంది.

గిరీషా లాగిన్ నుంచి 30 వేలకు పైగా నకిలీ ఓటర్ కార్డులు సృష్టించినట్లు ఎన్నికల కమిషన్ గుర్తించింది. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో నగరపాలక సంస్థ కమిషనర్ గా ఉన్న గిరీషా తన లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సిబ్బందికి ఇచ్చేయడంతో ఈ అక్రమాలు జరిగాయని ఈసీ గుర్తించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓ పక్షానికి కొమ్ముగాయకుండా నిష్పాక్షపతంగా వ్యవహరించాలన్న ఈసీ ఆదేశాలను ఉల్లంఘించిన ఐఏఎస్‌పై వేటు పడింది.