భువనగిరి ఎస్సి హాస్టల్ విద్యార్దునులు మృతిపై విచారణ జరపాలి 

భువనగిరి ఎస్సి హాస్టల్ విద్యార్దునులు మృతిపై విచారణ జరపాలి 

భువనగిరి ఎస్సి హాస్టల్ లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు భవ్య, వైష్ణవి ఆత్మహత్యలపై పలు అనుమానాలు కలుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి తెలిపారు.   మంగళవారం  ఆ హాస్టల్ని సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులు పరిశీలించిన ఆమె హాస్టల్ వార్డెన్ చెపుతున్న కారణాలు, విద్యార్థినుల తల్లితండ్రులు చెప్పే కారణాలు ఎక్కడ నమ్మశక్యంగా లేవని ఆమె స్పష్టం చేశారు. 

వెంటనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిపించి, వారి మరణాలకు కారణమైన  వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకొని, విద్యార్థినుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాల తరపున న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు.

విద్యార్థినుల వంటిపై ఉన్న గాయాలను చూస్తే ఆ విద్యార్థినులది హత్యనా? ఆత్మహత్య నా? అనే అనుమానం కల్గుతుందని ఆమె స్పష్టం చేశారు.  కాబట్టి ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టల్స్ కి రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకు అని ప్రశ్నించడం జరిగింది.

బాలికల వసతి గృహంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం గమనించానని చెబుతూ సొంత భవనాలు లేకుండా ప్రయివేటు భవనాలలో హాస్టల్స్ ని ఏర్పాటు చేసి కనీస వసతులు కల్పించలేని దౌర్బాగ్య పరిస్థితిలో ప్రభుత్వం అధికారులు ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టల్స్ లో  సరైన మౌళిక సదుపాయాలు,  భద్రత కల్పించాలని డా. శిల్పా రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.