అజిత్ పవార్‌దే అసలైన ఎన్సీపీ

అజిత్ పవార్‌దే అసలైన ఎన్సీపీ
దేశ రాజకీయాల్లో తల పండిన నేత శరద్ పవార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఆయన సోదరుడి కొడుకు అజిత్ పవార్‌దే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని మంగళవారం తీర్పు చెప్పింది. ఎన్సీపీ అధికార గుర్తు ‘గడియారం’ కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది.

ఎన్సీపీ, దాని ఎన్నికల గుర్తు ఎవరికి దక్కాలనే విషయంపై ఆరు నెలలుగా కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు సాగిస్తూ వచ్చింది. న్యాయ నిపుణులతో పలుమార్లు భేటీ అయింది. అనంతరం ఎన్సీపీ ఎన్నికల గుర్తు వివాదాన్ని పరిష్కరించింది. అజిత్ పవార్ నేతృత్వంలోని చీలిక వర్గానికి అనుకూలంగా రూల్ జారీ చేసింది.

పార్టీ రాజ్యాంగం, దానికి ఉన్న శాసన సభ్యుల సంఖ్యాబలం, సంస్థాగతంగా రూపొందించుకున్న మార్గదర్శకాలు.. వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నట్లు ఈసీ వివరించింది. సంస్థాగతంగా మెజారిటీని కలిగి ఉన్న వారి వాదనకు మద్దతుగా శరద్ పవార్ వర్గం వేసిన పిటీషన్లను పరిశీలించినట్లు తెలిపింది.

ఎన్సీపీ నుంచి బయటికి వచ్చిన అజిత్ పవార్ తనకు మద్దతు ఇస్తోన్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికిన విషయం తెలిసిందే. అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఎన్సీపీని, దాని గుర్తు తనకే దక్కుతుందంటూ ఈసీకి తెలియజేశారు. దీనిపై విచారణల అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, రాజ్యసభ ఎన్నికల దృష్టా కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు గాను శరద్ పవార్‌కు ఇసి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. బుధవారం సాయంత్రం 4 లోగా మూడు పేర్లు సూచించాలని శరద్ పవార్‌కు ఇసి గడువు ఇచ్చింది. పార్టీ నియమావళి లక్షాలు, ధ్యేయాలు, పార్టీ రాజ్యాంగం, సంస్థాగత, శాసనసభ సంబంధిత ఆధిక్యం పరీక్షలు వంటివి అనుసరించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వివరించింది.

కాగా, ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని వినమ్రతతో స్వీకరిస్తున్నట్లు అజిత్ పవర్ పేర్కొనగా, ఇది దురదృష్టకరమని పేర్కొంటూ `ప్రజాస్వామ్యం హత్య’గా శరద్ పవర్ వర్గంకు చెందిన మాజీ మంత్రి అనిల్ దేశముఖ్ విమర్శించారు. పైనుంచి వత్తిడులు కారణంగా కమిషన్ ఈ విధమైన నిర్ణయం వెలువరించింది ఆరోపించారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో తొలి నుంచి కీలక పాత్ర పోషిస్తున్న శరద్ పవార్ 1999లో నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశీయతను ప్రశ్నిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చారు. నాటి లోక్ సభ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. 

తిరిగి 1999 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2004 తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి కేంద్రంలోని యూపీఏ సర్కార్ లో చేరారు. 2014 వరకూ యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఎన్సీపీ ఉంది. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోపాటు ఎన్సీపీ కూడా దెబ్బ తిన్నది. 

అదే ఏడాది చివర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా, సీఎం పదవి విషయమై ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నాయకత్వంతో విభేదించి కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపారు. కానీ, వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే సారధ్యంలో శివసేనను చీల్చింది. 

తదుపరి శరద్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీని రెండుగా చీల్చింది. అజిత్ పవార్ ప్రస్తుతం బీజేపీ- శివసేన (షిండే) సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా  ఉన్నారు. త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల ముంగిట ఎన్సీపీని అజిత్ పవార్ కు అప్పగిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం శరద్ పవార్‌కు గట్టి షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.