కేంద్రంలో ఎన్డీయే 3 హయాంలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ తాము మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేండ్లలో దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఎదుగుతుందని స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వ చర్యలతో గత పదేండ్లలో దేశంలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా పురోగమిస్తుందని, ఈ లక్ష్యం దిశగా సాగుతున్నామని తెలిపారు. మొబిలిటీ రంగానికి ఇది స్వర్ణయుగమని చెప్పారు. ప్రస్తుతం దేశ ఆర్ధిక వ్యవస్ద వేగంగా ఎదుగుతున్నదని ప్రధాని పేర్కొన్నారు.
స్వయం ఆకాంక్షలు, ఆశలతో దేశంలో నూతన మధ్యతరగతి ఎదిగివస్తోందని తెలిపారు. మధ్యతరగతి ఆదాయాలు విస్తరిస్తున్నాయని, ఇవన్నీ మొబిలిటీ రంగం నూతన శిఖరాలకు చేరేందుకు ఉపకరిస్తాయని చెప్పారు. 2014కు ముందు భారత్‌లో 12 కోట్ల కార్లు విక్రయిస్తే, 2014 నుంచి 21 కోట్లకు పైగా కార్లు అమ్ముడయ్యాయని వివరించారు. భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడంలో ఆటో రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు.

More Stories
రష్యా చమురు కంపెనీలపై ట్రంప్ ఆంక్షలతో భారత్ కు ముప్పు?
త్రివిధ దళాలకు రూ.79 వేల కోట్ల రక్షణ కొనుగోళ్లు
మెహుల్ చోక్సీ అప్పగింతలో అడ్డంకులు లేవన్న బెల్జియం కోర్టు