రాజ్య‌స‌భ‌కు స‌త్నం సింగ్ సందూ నామినేషన్

రాజ్య‌స‌భ‌కు స‌త్నం సింగ్ సందూ నామినేషన్
చండీఘ‌డ్ యూనివ‌ర్సిటీ వ్య‌వ‌స్థాప‌క ఛాన్స‌ల‌ర్‌ స‌త్నం సింగ్ సందూ  రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయ్యారు. 2001లో తొలిసారి మొహాలీలోని లాండ్ర‌న్‌లో చండీఘ‌డ్ గ్రూప్ ఆఫ్ కాలేజీల‌ను ఆయ‌న స్థాపించారు. ఆ విద్యాసంస్థ‌ల‌ను ప్ర‌పంచ‌స్థాయి వ్య‌వ‌స్థ‌లుగా ఆయ‌న తీర్చిదిద్దారు. 2012లో ఆయ‌న చండీఘ‌డ్ యూనివ‌ర్సిటీని స్థాపించారు. 
 
2023 వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్స్‌లో ఆ వ‌ర్సిటీకి ర్యాంక్ రావ‌డం విశేషం. ఆసియాలో ఉన్న ప్రైవేటు వ‌ర్సిటీల్లో ర్యాంక్ సాధించిన తొలి వ‌ర్సిటీగా నిలిచింది.  స‌త్నం సింగ్ సందూ రాజ్య‌స‌భ‌కు నామినేట్ కావ‌డం ప‌ట్ల హర్షం ప్రకటిస్తూ ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్ర‌ప‌తి ముర్ము విద్యావేత్త స‌త్నం సింగ్‌ను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేయ‌డం సంతోషంగా ఉంద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. 
 
ప్ర‌ఖ్యాత విద్యావేత్త‌గా ఆయ‌న‌కు గుర్తింపు ఉన్న‌ద‌ని, సామాజిక కార్య‌క‌ర్త‌గా కూడా ఆయ‌నకు గుర్తింపు ఉంద‌ని తెలిపారు. వివిధ‌స్థాయిల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్న‌ట్లు చెప్పారు. జాతీయ స‌మ‌గ్ర‌త కోసం ఆయ‌న ప‌నిచేసిన‌ట్లు తెలిపారు. పార్ల‌మెంట్ జ‌ర్నీలో మంచి జ‌ర‌గాల‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. స‌త్నం సింగ్ అభిప్రాయాల‌తో రాజ్య‌స‌భ వ‌ర్ధిల్లుతుంద‌ని ప్ర‌ధాని ఆశాభావం వ్య‌క్తం చేశారు.