
ఒకప్పుడు క్రికెట్ ను ఏకచత్రాధిపత్యంతో ఏలిన వెస్టిండీస్ జట్టు ఇప్పుడు మాత్రం పసికూనల కంటే దారుణ ఆటతీరు కనబరుస్తూ కళావిహీనంగా తయారైంది. గతేడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ గెలవడమే గాక, మూడు నెలల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ఎగరేసుకుపోయి ఛాంపియన్ గా అవతరించిన ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే ఓడించి ఔరా అనిపించింది. విండీస్ ఆటతీరును తక్కువ అంచనా వేసి ఆధిక్యంలోకి రాకముందే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి ఆశ్చర్యపరిచిన కమిన్స్ కు గట్టి షాక్ తగిలేలా చేశాడు 24 విండీస్ బౌలర్ షమర్ జోసెఫ్.
వెస్టిండీస్ జట్టు 27 ఏళ్ల తర్వాత వారి సొంతగడ్డపైనే ఆస్ట్రేలియాను ఒక టెస్టు మ్యాచ్ లో ఓడించడంలో అత్యంత కీలకపాత్ర పోషించాడు షమర్ జోసెఫ్. ప్రఖ్యాత గబ్బా స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో శనివారం బ్యాటింగ్ చేస్తుండగా స్టార్క్ యార్కర్ బలంగా తాకి షమర్ కాలి బొటన వేలికి గాయమైంది. దీంతో మైదానాన్ని వీడిన అతను మరుసటి రోజు జట్టును గెలిపించడం కోసం పెయిన్ కిల్లర్స్ తీసుకొని మైదానంలోకి వచ్చాడు.
కేవలం 11.5 ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు.. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో జోసెఫ్ ప్రదర్శనకు తలవంచి 207 పరుగులకు ఆలౌట్ కావడంతో 8 పరుగుల తేడాతో విండీస్ చారిత్రక విజయాన్ని సాధించింది. ఆసీస్ ను తన బౌలింగ్ తో గడగడలాడించిన షమర్ జోసెఫ్.. సెక్యూరిటీ గార్డు నుంచి బౌలర్ గా ఎలా ఎదిగాడన్న దానిపై ఆసక్తికర కథనం.
గయానా దీవుల్లోని ఒక మారుమూల పల్లెటూరికి చెందిన పేద కుటుంబంలో పుట్టాడు షమర్ జోసెఫ్. 2018 ముందు వరకు అతను పుట్టిన గ్రామానికి ఇంటర్నెట్,ఫోన్ సౌకర్యాలు లేవు. సమీప పట్టణానికి వెళ్లాలన్నా పడవలే దిక్కు. కుటుంబ పోషణ బారం మీద పడడంతో పెద్దగా చదువుకోని షమర్ 13 ఏళ్ల వయసులోనే చెట్ల కొమ్మలు, మొద్దులు నరికే పనికి వెళ్లాడు. 18 ఏళ్ల వయసులోనే వివాహం కావడంతో కుటుంబాన్ని పోషించడం కోసం పట్టణానికి వెళ్లి రోజువారీ కూలీగా పనిచేశాడు.
ఆ తర్వాత సెక్యూరిటీ గార్డుగానూ విధులు నిర్వర్తించాడు. గత రెండేళ్ల ముందు వరకు కూడా షమర్ సెక్యూరిటీగానే పని చేశాడు. కానీ ఎంత కష్టం వచ్చినా తనకు ఇష్టమైన క్రికెట్ ను మాత్రం వదల్లేదు. వీలు చిక్కినప్పుడల్లా గయానా లోని క్రికెట్ గ్రౌండ్ కు వెళ్లి బౌలింగ్ సాధన చేసేవాడు. అలా ఫాస్ట్ బౌలింగ్ పై నైపుణ్యం సంపాదించాడు. అప్పటికే వెస్టిండీస్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న రొమారియో షెపర్డ్ తో.. షమర్ జోసెఫ్ కు మంచి సన్నిహిత్యం ఉంది. షెపర్డ్ చొరవతో గయానా కోచ్ దృష్టిలో పడ్డాడు షమర్ జోసెఫ్.
ఆడిన తొలి మ్యాచ్ లోనే ఆరు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. ఆ తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ నెట్ బౌలర్ గా చాన్స్ దక్కింది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ గతేడాది ఫిబ్రవరిలో గయానా తరపున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం అందుకున్నాడు. ఏడాది నుంచి అటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ తో పాటు.. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లోనూ నిలకడగా రాణించిన షమర్ జోసెఫ్.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. టెస్టు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు సిరీస్ లోనే 13 వికెట్లతో సంచలన ప్రదర్శన చేసిన షమర్ జోసెఫ్ హీరోగా మారిపోయాడు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు