రామాలయంతో ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం..!!

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట తర్వాత ఉత్తర్ ప్రదేశ్ లో పర్యాటకం మరింతగా పెరుగుతుందని అంచనా. దీనికి సంబంధించి ఎస్ బీఐ ఒక నివేదిక విడుదల చేసింది. ఇందులో ఈ టూరిజం వల్ల యూపీ, దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత లాభపడుతుందనేది వివరించింది. ఇక 2018-19లో దేశ జీడీపీలో పర్యాటక రంగం రూ. 16.12 లక్షలో కోట్ల సహకారం అందించింది. అయితే 2032-33 నాటికి ఇది ఏటా 8 శాతం వృద్ధితో రూ. 36.81 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని అంచనా.

రామమందిర నిర్మాణంతో అయోధ్య భారతదేశంలో సందర్శించదగ్గ పర్యాటక ప్రదేశం కానుంది. గతంలో కంటే ఎక్కువ మంది పర్యాటకులు అయోధ్యకు చేరుకునే అవకాశముంది. ఇది ఉత్తర్ ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను భారీగా పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. 2024-25 ఉత్తర్ ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ రూ. 20వేల నుంచి 25వేల కోట్లకు పెరుగుతుందని చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్ర పర్యాటక రంగం ఆదాయం రెట్టింపు అవుతుందని, ఇప్పటికే అయోధ్యలో హోటల్స్ , రెస్టారెంట్స్, ఇతర వ్యాపారాలు భారీగా సాగుతున్నాయి.

2022లో ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించిన పర్యాటకుల సంఖ్య 32 కోట్లుగా ఉంది. ఇందులో 2.21 కోట్ల మంది జనాభా అయోధ్యకు వచ్చారు. పర్యాటకుల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 2 లక్షల కోట్లు అని తెలుస్తోంది. పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందంజలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్, అయోధ్య రామమందిర నిర్మాణంతో మరింత ఆదాయం పొందనుంది. 2027 నాటికి ఉత్తర్ ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లు దాటుతుందని, దేశ జీడీపీలో ఇది 10 శాతం అని చెబుతున్నారు. 2027-28 నాటికి జీడీపీ వెయిటేజ్ లో ఉత్తర్ ప్రదేశ్ 2వ స్థానం పొందుతుందని సమాచారం. నార్వే జీడీపీని అప్పటికి ఉత్తర్ ప్రదేశ్ అధిగమించే అవకాశాలు చాలానే ఉన్నాయి.